కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి అలుకోత్సవం బుధవారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. అనంతరం స్వామి వారు అశ్వవాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. చతురంగ బలాల్లో అత్యంత ప్రధానమైనది అశ్వ బలమని, కలియుగాంతంలో తాను అశ్వ వాహనంపై వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తానని చాటి చెప్పడం కోసమే శ్రీవారు అశ్వవాహనంపై ఊరేగుతారని వేద పండితులు వివరించారు. అంతకుముందు యాగశాలలో నిత్యహోమం చేశారు. అనంతరం శ్రీవారిని విశేషంగా అలంకరించి ఆలయానికి సమీపంలో ఉన్న సుద్దుల మండపం వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న భక్తులు ‘ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవింద’ అంటూ కీర్తించారు. ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చక పండితులు బ్రహ్మోత్సవాలతో పాటు అలుకోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. అన్ని ఉత్సవాలకు ఉభయదారులుగా భక్తులు వ్యవహరిస్తే ఆనవాయితీ ప్రకారం అలుకోత్సవానికి ఆలయ సహాయ కమిషనర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.
నేడు తీర్థవాది ఉత్సవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తీర్థవాది ఉత్సవం గురువారం భృగుతీర్థం(కోనేరు)లో భక్తుల కోలాహలం మధ్య వైభవంగా జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం నాడు ఆలయం ముందున్న ప్రధాన ధ్వజ స్తంభానికి కట్టిన కంకణాలు గురువారం మధ్యాహ్నం విప్పేస్తారు. దీంతో తీర్థవాది ఉత్సవం ముగుస్తుంది. అనంతరం స్వామివారు ఆలయంలోకి ప్రవేశిస్తారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆలయం తలుపులు మూసివేస్తారు. తిరిగి శుక్రవారం ఉదయం నుంచి స్వామివారు ఆలయంలో భక్తులకు దర్శనమిస్తారు.
స్వామివారికి పట్టువస్త్రాలు
సమర్పించిన ఈఓ దంపతులు
రేపటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
ఖాద్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ బహుళ దశమి అంటే శుక్రవారం (రేపు) రాత్రి జరగనున్న పుష్పయాగోత్సవంతో ముగియనున్నాయి.


