రొళ్ల: విద్యుత్ కోతలు, లో ఓల్టేజీ సమస్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మల్లినమడుగు పంచాయతీ పరిధిలోని రైతులు బీజీహళ్లిలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసిన విషయం మరువక ముందే తాజాగా మంగళవారం ఎం.రాయాపురం పంచాయతీ పరిధిలోని రైతులు బీజీహళ్లిలోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. దాదాపు 40 రోజులుగా లో ఓల్టేజీతో పాటు విద్యుత్ కోతలతో పంటలకు నీటి తడులు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా వేరుశనగ, మొక్కజొన్న, రాగి, వరి, మిరప, అరటి, దానిమ్మ, మల్బరీ తదితర పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. తాము అధికారంలోకి వస్తే రోరజూ 9 గంటల నాణ్యమైన త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తామంటూ ఎన్నికల సమయంలో టీడీపీ పెద్దలు హామీనిచ్చారని, అయితే అధికారం చేపట్టిన తర్వాత నిరంతర కోతలతో తమను దగా చేశారని మండిపడ్డారు. లోఓల్టేజీ సమస్య కారణంగా మోటార్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయన్నారు. సమస్యకు పరిష్కారం చూపే వరకూ అక్కడి నుంచి వైదొలిగేది లేదని భీష్మించారు. ఈ సందర్భంగా ఆందోళన కారులతో మండల విద్యుత్ శాఖ ఏఈ నిజాముద్దీన్ చర్చించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. వారం రోజుల్లోపు సమస్య పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తూ నిరసనను విరమించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ నరసింహారెడ్డి, వైస్ సర్పంచ్ సీఎం ఘట్ట రవి, వార్డు మెంబర్ వజీర్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
పంటలు ఎండుతున్నాయంటూ సబ్‌స్టేషన్ ముట్టడి


