భక్తుల ‘బ్రహ్మ’రథం | - | Sakshi
Sakshi News home page

భక్తుల ‘బ్రహ్మ’రథం

Mar 11 2026 7:21 AM | Updated on Mar 11 2026 7:21 AM

కదిరి: శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నారసింహుడి బ్రహ్మ రథోత్సవంలో 3 లక్షల మంది దాకా భక్తులు పాల్గొన్నట్లు అంచనా.

● బ్రహ్మరథం సరిగ్గా ఉదయం 8.25 గంటల నుంచి 8.45 గంటల మధ్య ప్రారంభించాల్సి ఉండగా ఉదయం 9.35 గంటలకు ముందుకు కదిలింది.

● గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బాగా ఆలస్యంగా నడిచింది. సరిగ్గా సాయంత్రం 3.08 గంటలకు తేరు యథాస్థానం చేరుకుంది.

● ఆనవాయితీగా వస్తున్న మూర్తిపల్లి, బేరిపల్లి, కుటాగుళ్ల, నాగిరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు రథానికి సండ్ర మొద్దులు, తెడ్లు వేస్తూ రథ గమనాన్ని నియంత్రిస్తుంటే పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మ రథాన్ని లాగారు.

● తిరు వీధుల ఆక్రమణల కారణంగా బ్రహ్మరథం లాగేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు.

● రథోత్సవంలో బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన కుండా హౌస్‌ అరెస్ట్‌ చేయించడంపై భక్తులు ఎమ్మెల్యే కందికుంటపై ఆగ్రహించారు. కొందరు శాపనార్థాలు పెట్టారు. అయితే, తాము అతన్ని హౌస్‌ అరెస్ట్‌ చేయలేదని పోలీసు అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేయడం కొసమెరుపు.

● రథం తిరువీధుల గుండా వెళ్తుంటే భక్తులు దవణం, మిరియాలు, అరటి పండ్లు రథంపైకి విసిరి స్వామి వారిని స్మరించుకున్నారు.

● రథం వెళ్లాక రోడ్డుపై పడిన మిరియాలను భక్తులు ఒక్కోటి సేకరించడం కన్పించింది. అవి కొన్ని రకాల వ్యాధులను నయం చేస్తాయని వారి నమ్మకం.

● జేబు దొంగలు ఈసారి కూడా తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారు. ఎంతో మంది భక్తులు బంగారు ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్లు పోగొట్టుకొని లబోదిబోమన్నారు.

● మిద్దెలపై నుంచి కొందరు రథంలాగే భక్తుల మీదకు బిందెలతో నీళ్లు చల్లారు. మరి కొందరు నీళ్ల ప్యాకెట్లు విసిరారు.

● బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్‌ పార్థసారథి, ఆయన కుమారుడు వంశీకృష్ణ ఎప్పటిలాగానే రథంపై నిల్చొని రథ కదలికలను మైకు ద్వారా తెలియ జేశారు. భక్తులతో గోవింద నామస్మరణలను పలికించి వారిని ఉత్సాహపరుస్తూ వచ్చారు.

● భక్తుల కోసం పట్టణంలో ఈసారి కూడా అడుగడుగునా ఉచిత అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు.

● నృసింహాలయంలో భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు.

● తలనీలాలు సమర్పించుకునేందుకు వచ్చిన భక్తుల నుంచి గుండుకు రూ. 200 వసూలు చేసినట్లు పలువురు ఆరోపించారు.

● తేరు శివాలయం దాటి కాస్త ముందుకు వెళ్లగానే ఒక్కసారిగా భక్తుల తోపులాటతో ఆరుగురు భక్తులు తేరు కుడివైపు ఉన్న ముందు చక్రం కింద పడ్డారు. వారిని బయటకు తీయడానికి 40 నిమిషాలు పట్టింది. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement