ఏసీబీ సోదాలతో అలజడి | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ సోదాలతో అలజడి

Mar 11 2026 7:21 AM | Updated on Mar 11 2026 7:21 AM

అనంతపురం క్రైం: భవన నిర్మాణాల అనుమతి అంశంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం అనంతపురం నగరపాలక సంస్థలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ హమీద్‌ ఖాన్‌ నేతృత్వంలోని 20 మంది సభ్యులతో కూడిన బృందం ఉదయం 10.30 గంటలకు చేరుకుని టౌన్‌ప్లానింగ్‌ విభాగాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. నగరంలో అక్రమ కట్టడాలు, సెట్‌బ్యాక్‌ నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలు, నివాస గృహాల పేరుతో కమర్షియల్‌ కాంప్లెక్సులు నిర్మించిన అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టారు. టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ ల్యాప్‌టాప్‌, సిబ్బంది వినియోగించే కంప్యూటర్‌లలోని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. భవన నిర్మాణ దరఖాస్తులు... అనుమతులు.. పెండింగ్‌లో ఉంచడానికి గల కారణాలు.. ప్లానింగ్‌ మేరకు భవనాలు నిర్మించారా.. అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

ఏసీబీ రాకతో జారుకున్న అధికారులు

ఏసీబీ రాకతో కీలక విభాగాల అధికారులు క్షణాల వ్యవధిలో నగరపాలక సంస్థ ఆవరణం నుంచి జారుకున్నారు. రెవెన్యూ విభాగం, ఇంజినీరింగ్‌ విభాగం పూర్తిగా ఖాళీ అయ్యింది. ఇదిలా ఉండగా సాయంత్రం 4 గంటల దాకా టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో సోదాలు చేసిన ఏసీబీ బృందాలు అనంతరం ఇంజినీరింగ్‌ విభాగంలో కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీ బిల్లుల వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలు చాలా కాలంగా దుమారం రేపుతున్నాయి. సంబంధిత విభాగాల అధిపతులు ఈ ఆరోపణలపై కనీస విచారణ కూడా చేపట్టలేదు. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది అధికారుల వివరాలను ఆరా తీసిన ఏసీబీ అధికారులు కొన్ని ఇంజినీరింగ్‌ పనుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

‘రెవెన్యూ’లో రాబందులు

నగర పాలక సంస్థలోని రెవెన్యూ విభాగంలో రాబందులు చేరాయి. పేదల రక్తాన్ని జలగల్లా తాగుతున్నాయి. ఏసీబీ అధికారుల బృందం ఓ వైపు సోదాలు చేస్తుంటే.. మరో వైపు ఆ విభాగంలోని కొంతమంది ఆర్‌ఓల సూచనల మేరకు కీలక రికార్డులను కార్యాలయం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు తెలిసింది. వీటిలో చాలా వరకు నూతన నిర్మాణాల పన్ను విధింపు, పేరు మార్పు, గుత్తల మార్పులు, చేర్పులున్నట్లు తెలిసింది. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్లియర్‌ చేయకుండా లంచం కోసం చాలా కాలంగా పెండింగ్‌ ఉంచడం, కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం పరిపాటిగా ఉంటోంది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఎక్కడ సోదాలు చేస్తారోనని భయపడి గుత్తల వసూళ్ల పేరుతో బయటికెళ్లిపోయారు.

ఫిర్యాదులపై సోదాలు..

నగరంలో అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులపై అందిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని సోదాలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం రికార్డుల పరిశీలన కొనసాగుతోందన్నారు. బుధవారం క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాలు, సెట్‌బ్యాక్‌ తనిఖీలు చేపడతామన్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో అనుమతులు జారీ చేసే విధానంలో అవకతవకలు జరిగాయన్న అనుమానాల నేపథ్యంలో కీలక ఫైళ్లు, పత్రాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.

నగరపాలక సంస్థలో నిశ్శబ్దం

టౌన్‌ప్లానింగ్‌లో రికార్డులు, ఫైళ్లు స్వాధీనం

ఫిర్యాదులపై నేడు క్షేత్రస్థాయిలో నిర్మాణాల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement