ఖాద్రీ వైభవం..
కదిరి: అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం రానేవచ్చింది. అశేష భక్త జన సందోహం మధ్య మంగళవారం (నేడు) ఉదయం 8.25 నుంచి 8.45 గంటల మధ్య శుభ మేష లగ్నమందు తేరు ప్రారంభించేందుకు ఆలయ అర్చక పండితులు శుభ ముహూర్తంగా నిర్ణయించారని ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్సవం ఇది. ఇప్పటికే ఆలయ ప్రాంగణంతో పాటు తిరు వీధుల గుండా ఉన్న భవనాలు సైతం భక్తులతో కిట కిటలాడుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో కాలు మోపేందుకు చోటు లేదు. బ్రహ్మోత్సవాల్లో నారసింహుడు తిరు వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించడానికి దేవతలు తమ తమ వాహనాలను పంపుతారని భక్తుల నమ్మకం. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే శ్రీవారి రథోత్సవం నాడు రథాన్ని నడిపి స్వామి వారు విహరించడానికి సహకరిస్తారని, అందుకే బ్రహ్మ రథోత్సవం అంటారని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు తెలిపారు.
దేశంలోనే మూడో పెద్ద తేరు
తమిళనాడు ఆండాల్ అమ్మవారు శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూర్ జిల్లాలోని తిరువార్ రథం తర్వాత దేశంలో అతిపెద్ద రథంగా కదిరి తేరు ప్రసిద్ధి చెందింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అతిపెద్ద బ్రహ్మరథం ఇదే. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు. 125 ఏళ్ల క్రితం తయారు చేసిన రథం చక్రాలు ఒక అడుగు, ఒక అంగుళం వెడల్పుతో 8 అడుగుల డయామీటర్‌తో ఉన్నాయి. రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను టేకుతో అందంగా చెక్కారు. వివిధ భంగిమల్లో చెక్కిన ఈ బొమ్మలు అప్పటి శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రథ చక్రాలకు ఈ మధ్యే మరమ్మతులు కూడా చేశారు. రథోత్సవంలో 3 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం పట్టణంలో అడుగడుగునా అన్నదానానికి దాతలు ముందుకొచ్చారు.
భారీ బందోబస్తు..
ఖాద్రీశుడి బ్రహ్మ రథోత్సవానికి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 25 మంది ఎస్‌ఐలు, 250 మంది సివిల్ పోలీసులు, 150 మంది ఏఆర్ పోలీసులు, 120 మంది హోంగార్డులతో పాటు మరో 26 మందితో కూడిన ప్లటూన్ బలగాలను నియమించినట్లు ఆయన వెల్లడించారు. రథోత్సవం సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు. తిరువీధుల్లోకి ద్విచక్ర వాహనాలను సైతం అనుమతించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు.
ఎక్కడెక్కడి నుంచో విచ్చేసిన జనం... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే
తరుణం. బ్రహ్మే రథసారథిగా మారే
సందర్భం. ఉగ్రుడైన లక్ష్మీనారసింహుడు శాంతమూర్తిగా రథంపై కొలువుదీరి భక్తులకు కనిపించే కమనీయ దృశ్యం. లక్షలాదిమంది ఒకచోట చేరే ఆధ్యాత్మిక సౌరభం. అదే ఖాద్రీశుడి బ్రహ్మరథోత్సవం. మంగళవారం ఉదయం సరిగ్గా 8.45
గంటలకు ప్రారంభం కానుంది.
నేడే ఖాద్రీ లక్ష్మీ నారసింహుడి
బ్రహ్మ రథోత్సవం
దేశంలోనే మూడవది,
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రథం
3 లక్షల మందికి పైగా
భక్తులు పాల్గొంటారని అంచనా
భారీ పోలీసు బందోబస్తు..
అడుగడుగునా అన్నదానానికి ఏర్పాట్లు


