ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందే అర్జీలన్నింటినీ సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’లో పాల్గొన్నారు. డీఆర్‌ఓ విజయసారథి, ఎస్‌డీసీ సూర్య నారాయణరెడ్డి, డీఆర్‌ఓ సువర్ణతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై 265 అర్జీలు రాగా, పరిష్కారం కోసం వాటిని ఆయా శాఖలకు పంపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అర్జీదారుడు సంతృప్తి చెందేలా ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను పరిష్కరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలను పెండింగ్‌లో ఉంచకూడదన్నారు.
విద్యుత్ స్తంభాలను తొలగించాలి..
కొత్తచెరువులో రోడ్డు వెడల్పు పనులు పెండింగ్ పడ్డాయని, రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి ప్రమాదాలను నివారించాలని గ్రామానికి చెందిన వడ్డె పాపన్న ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్‌కు విన్నవించారు. ఈ విషయమై ఎన్నిసార్లు అర్జీలిచ్చినా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
జిల్లాకు 6,390
హెచ్‌పీవీ టీకాలు
ప్రశాంతి నిలయం: గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ముప్పు తప్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా అందించే హెచ్‌పీవీ టీకాలు జిల్లాకు 6,390 వచ్చాయని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. 2026 ఫిబ్రవరి 28 నాటికి 14 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలికలందరికీ హెచ్‌పీవీ టీకాలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి హెచ్‌పీవీ టీకాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఈఓ కిష్టప్ప, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోలా బేగం, డీసీహెచ్‌ఎస్ మధుసూదన్, ఆరోగ్యశ్రీ కోర్డినేటర్ శ్రీదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి నాగేంద్ర నాయక్, మెప్మా పీడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
● సోమవారం పరీక్షకు
135 మంది విద్యార్థుల గైర్హాజరు
పుట్టపర్తి: ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం జిల్లాలోని 42 కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులకు మ్యాఽథ్స్ పేపర్–2బీ, ఒకేషనల్ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్, బయాలజీ పరీక్ష నిర్వహించారు. జనరల్‌కు సంబంధించి 4,714 మందికి గాను 4,656 మంది హాజరు కాగా.. 58 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 737 మందికి గాను 660 మంది హాజరుకాగా, 77 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్న కేశవప్రసాద్ పేర్కొన్నారు. మొత్తమ్మీద 5,451 మందికి గాను 135 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ వెల్లడించారు.
అయ్యో ‘పాప’ం
● నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
కనగానపల్లి: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి సమీపంలోని నీటి తొట్టెలో పడి ప్రాణాలు పొగొట్టుకొంది. ఈ సంఘటన సోమవారం కుర్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కుర్లపల్లి గ్రామానికి చెందిన హరిజన నరేష్, సుకన్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు సంతానం. సోమవారం సాయంత్రం వేళ కుటుంబీకులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా.. చిన్న కూతురు అంకిత (18 నెలలు) ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి సమీపంలోని నీటి తొట్టెలో పడిపోయింది. అరగంట తర్వాత ఇంట్లో పని ముగించుకుని బయటకు వచ్చిన చిన్నారి తల్లి... పాపకోసం చుట్టుపక్కల వెతికింది. అయినా ఫలితం లేకపోగా ఇంటికి వచ్చి మరోసారి ఆవరణ అంతా పరిశీలించగా... నీటి తొట్టెలో తేలుతూ చిన్నారి అంకిత కనిపించింది. దీంతో ఆమె పాపను వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్లగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తూ దుఃఖ సాగరంలో మునిగారు.


