● ఆలయంలో పోటెత్తిన భక్త జనం
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు సోమవారం రాత్రి తెల్లటి ఐరావతం(గజవాహనం)పై భక్తులకు దర్శనమిచ్చారు. హిరణ్య కస్యపుని సంహరించిన నారసింహుడి ఉగ్ర రూపాన్ని చూడలేని దేవతాగణం మరోసారి యథారూపంలో ప్రసన్నం కావాలని కోరగా... స్వామి వారు వారి కోరిక మేరకు తెల్లటి ఐరావతంపై దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. ఐరావతంపై విహరించే ఖాద్రీశుడి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో కాలుమోపేందుకు కూడా చోటు లేని విధంగా భక్తులతో కిక్కిరిసి పోతోంది. అంతకుముందు ఆలయ అర్చకులు తొలుత యాగశాలలో నిత్య హోమాలు నిర్వహించి రథ కలశ పూజలు చేసిన అనంతరం కలశాన్ని శ్రీవారి బ్రహ్మ రథంపై ప్రతిష్టించారు. స్వామివారికి నిత్య కైంకర్య సేవలు నిర్వహించిన మీదట బ్రహ్మరథం వద్ద శుద్ధి పుణ్య హవచనం, వాస్తు హోమాలు, రథాంగ హోమాలు, రథ సంప్రోక్షణ చేశారు. ఐరావతంపై ఊరేగిన అనంతరం శ్రీవారు తిరిగి ఆలయంలోకి వెళ్లారు. పూజల అనంతరం తెల్లవారుజామున రథంపైకి ప్రవేశిస్తారు. శ్రీదేవి, భూదేవిలను కంకణ భట్టాచార్యులు రథంపైకి తీసుకొస్తారు.


