పుట్టపర్తి టౌన్: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కడప రీజినల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్, డీఈఓ కిష్టప్ప పేర్కొన్నారు. మంగళ వారం సాయంత్రం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి మంగళకర ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి జిల్లాలో 107 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా చూసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అవకతవకలు జరిగితే చర్యలు తప్పవన్నారు. కేంద్రాల్లో తాగునీరు, పక్కాగా విద్యుత్, వైద్య సదుపాయాలు, గాలి, వెలుతురు, గదుల్లో ఫ్యాన్లు ఉండేలా చూడాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పరీక్ష మొదలైనప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా పేపర్ లీక్ అయినట్లు తెలిస్తే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ దేవరాజ్, 107 సెంటర్ల చీఫ్ సూపరింటెండెంట్లు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.


