కదిరి అర్బన్: ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలను రాజకీయ వేదికలా వాడుకోవడం సబబు కాదని టీడీపీ, బీజేపీ నేతలకు సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ హితవు పలికారు. మంగళవారం కదిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవంలో తాను పాల్గొంటే హత్య చేస్తామంటూ బెదిరిస్తున్నారని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఆరా తీశారన్నారు. తనకు ఫోన్ చేసి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, విష్ణువర్దన్‌రెడ్డి మధ్య వివాదాన్ని అడిగి తెలుసుకున్నారన్నారు. వారి మధ్య ఏవైనా విభేదాలు ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయాల్లో కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప ఇలా శ్రీవారి బ్రహ్మోత్సవాలను వేదికగా మార్చుకోడం తగదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని సమస్య, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, విభజన చట్టం హామీలపై మాట్లాడకుండా కేవలం కల్తీ నెయ్యిపై మాట్లాడడం సిగ్గు చేటన్నారు.
కుక్కను తప్పించబోయి
దంపతులకు తీవ్ర గాయాలు
● భర్త పరిస్థితి విషమం
బత్తలపల్లి: రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులు కిందపడి గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు.. బత్తలపల్లిలోని బళ్లారి దుర్గమ్మ గుడి వెనుక భాగంలో నివాసముంటున్న సాకే నరసింహులు కుమారుడు సాకే నరేష్ తన భార్య గాయత్రితో కలిసి కదిరిలో మంగళవారం జరుగుతున్న రథోత్సవానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అక్కడ వేడుక ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణమై గుమ్మల్లకుంట బస్టాఫ్ సమీపంలోకి చేరుకోగానే ఉన్నఫళంగా రోడ్డుపైకి వచ్చిన వీధి కుక్కను తప్పించే క్రమంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. ఘటనలో రోడ్డుపై పడిన దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహకారంతో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మాదిరెడ్డి జయరామిరెడ్డి క్షతగాత్రులను వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. నరేష్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా, నరేష్ కియా పరిశ్రమలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
యూట్యూబర్‌పై కేసు నమోదు
అనంతపురం సెంట్రల్: వ్యవసాయశాఖ ఏడీ అల్తాఫ్ అలీఖాన్‌పై బెదిరింపులకు పాల్పడి ఆయన పరువుకు భంగం కలిగించిన కేసులో యూట్యూబర్ హనుమంతరెడ్డిపై అనంతపురం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ శ్రీకాంత్‌యాదవ్ తెలిపిన మేరకు... గత ఫిబ్రవరిలో ఆదిమూర్తినగర్‌లోని వ్యవసాయశాఖ డివిజన్ కార్యాలయంలో ఏడీ అల్తాఫ్‌ఖాన్‌ను యూట్యూబర్ హనుమంతరెడ్డి కలిసి డబ్బులు డిమాండ్ చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నీ కథ చూస్తానని బెదిరించాడు. అలాగే తన ఫొటో వాడుకుని పరువుకు భంగం కలిగించేలా యూట్యూబ్ చాన్‌లో రీల్ వైరల్ చేశాడు. దీంతో తన పరువు, ప్రతిష్టతలను దెబ్బతీశాడంటూ ఫిబ్రవరి 23న పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందన లేదని అనంతరం హైకోర్టును బాధితుడు ఆశ్రయించారు. దీంతో యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా హనుమంతరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


