చిన్నారి చికిత్స కోసం విరాళాల సేకరణ | - | Sakshi
Sakshi News home page

చిన్నారి చికిత్స కోసం విరాళాల సేకరణ

Mar 11 2026 8:36 AM | Updated on Mar 11 2026 8:36 AM

పరిగి: అరుదైన వ్యాధితో బాధపడుతున్న లేపాక్షికి చెందిన నటరాజ్‌, శైలజ దంపతుల మూడేళ్ల కుమారుడు కేయాన్స్‌ అద్విక్‌కు ఆర్థిక సాయం అందించేందుకు పరిగి మండలం ఊటుకూరు యువకులు సిద్ధమయ్యారు. స్పైనల్‌ మస్క్యూలర్‌ అట్రోఫి(ఎస్‌ఎంఏ) వాధితో బాధపడుతున్న చిన్నారి ప్రాణాలు దక్కాలంటే దాదాపు రూ.16 కోట్ల విలువైన ఏవీఎక్స్‌ఎస్‌–101 ఇంజెక్షన్‌ వేయాల్సి ఉంటుందని బెంగళూరులోని ఓ కార్పొరేట్‌ వైద్యుల సూచించారు. దీంతో ఆ స్థాయి వైద్యం అందించే ఆర్థిక స్థోమత లేక తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఊటుకూరు గ్రామానికి చెందిన యువకులు... ప్రజలను చైతన్య పరుస్తూ విరాళాల సేకరణ చేపట్టారు.

ఓడీచెరువు విద్యార్థికి ఏడు గోల్డ్‌ మెడల్స్‌

ఓడీచెరువు: మండల కేంద్రం ఓడీ చెరువుకు చెందిన పిన్ను నరసింహబాబు కుమార్తె సాయి పౌష్ణవి వైద్య విద్యలో ఏకంగా ఏడు బంగారు పతకాలు దక్కించుకుని ప్రతిభ చాటింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలో ఆమె వైద్య విద్యను అభ్యసించింది. ఆదివారం ఆ కళాశాల స్నాతకోత్సవంలో ఆ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా ఆమె బంగారు పతకాలతో పాటు పట్టాను అందుకుంది. తన ప్రతిభతో ఓడీ చెరువు ఖ్యాతిని ఇనుమడింపజేసిన పౌష్ణవిని ఈ సందర్భంగా గ్రామస్తులు అభినందించారు.

చైన్‌స్నాచర్‌ అరెస్ట్‌

బుక్కరాయసముద్రం: మహిళపై దాడి చేసి, ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను అనంతపురం రూరల్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా వెల్లడించారు. గత నెల 14న బీకేఎస్‌లోని గాంధీనగర్‌ సమీపంలో ఓ హోటల్‌లో ఉన్న ముత్యాల శ్రీదేవి తలపై చైన్‌ స్నాచర్‌ ఇనుప రాడ్‌తో దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. ఘటనపై బాధివతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బీకేఎస్‌ సీఐ పుల్లయ్య, ఎస్‌ఐ రాంప్రసాద్‌ మంగళవారం తడకలేరు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో అనుమానస్పదంగా కనిపించిన ఓ యువకుడిని అడ్డుకుని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పీఎస్‌కు తరలించి తమదైన శైలిలో ప్రశ్నించడంతో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన విషయం బహిర్గతమైంది. యువకుడిని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం వసంతపురం గ్రామానికి చెందిన చెడిపోతుల మహేష్‌గా గుర్తించారు. ప్రస్తుతం అనంతపురంలోని ఓబులదేవనగర్‌లో నివాసముంటున్నాడు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడేవాడు. నాలుగు తులాల బంగారు గొలుసు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

యువకుడి ఆత్మహత్య

బొమ్మనహాళ్‌: క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌ గ్రామానికి చెందిన వెంకటేశులు, శ్రీదేవి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో బేకరీ నిర్వహిసూత కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుమారుడు తిరుమల (21) కర్ణాటకలోని బళ్లారిలో ఉన్న ఇండో–అమెరికన్‌ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ మధ్యలో వదిలేసి ఖాళీగా ఉంటున్నాడు. బుద్ధిగా చదువుకోవాలని తల్లిదండ్రులు పలుమార్లు సూచించినా తిరుమలలో మార్పు రాలేదు. ఇదే విషయంగా సోమవారం రాత్రి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మందలించారు. దీంతో గదిలోకి తలుపు వేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో బద్ధలుగొట్టి లోపలకు వెళ్లి చూశారు. అప్పటికే ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని విగతజీవిగా వేలాడుతున్న తిరుమలను గమనించి కన్నీరుమున్నీరుగా విలపించారు. సమచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తండ్రి వెంకటేశులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement