అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా షీప్ యూనియన్ జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వమించకపోవడం బాధాకరమని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పశుశాఖ జేడీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం జరిగిన గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘాల యూనియన్ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడీ కేఎల్ శ్రీలక్ష్మి అధ్యతన జరిగిన సమావేశానికి రిజిస్ట్రార్ హోదాలో జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్, పర్సన్ ఇన్‌చార్జ్ హోదాలో డీడీ డాక్టర్ వై.రమేష్‌రెడ్డి, వీఏఎస్ డాక్టర్ గోల్డ్స్‌మన్, షీప్ యూనియన్ ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షుడు, పలువురు సభ్యులు హాజరయ్యారు. జిల్లా కమిటీకి సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు పూర్తి చేస్తే.... జీవాల పరిరక్షణ, కాపర్ల సంక్షేమానికి సంబంధించిన పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని సభ్యులు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో సొసైటీలకు ఎన్నికలు నిర్వహించామని, వివిధ కారణాలతో కొన్ని సొసైటీల్లో ఎన్నికలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. తొందరలోనే జిల్లా యూనియన్ ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఎన్‌సీడీసీ కింద రాయితీతో అందించిన రూ.10.60 కోట్ల రుణాల్లో 350 మంది నుంచి ఇంకా రూ.4.45 కోట్ల బకాయిలు ఉన్నందున వాటిని సాధ్యమైనంత తొందరగా చెల్లించాలని సూచించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, అలాగే హిందూపురం, లేపాక్షి, గోరంట్ల, ముదిగుబ్బ, కదిరి, చెన్నేకొత్తపల్లి ఏరియా పశువుల ఆస్పత్రి పరిధిలో ఔషధి కేంద్రాలను షీప్ సొసైటీల ద్వారా నిర్వహించే అంశం, సొసైటీల పునరుద్ధరణ, ఆడిట్ రిపోర్టు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
సర్వసభ్య సమావేశంలో సభ్యుల డిమాండ్


