ప్రశాంతి నిలయం: జిల్లాలోని గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని వీసీ హాలులో గ్యాస్ డీలర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... యుద్ధ సంక్షోభంతో వంట గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, బ్లాక్ మార్కెట్‌కు తరలించినా చర్యలు తీసుకుంటామన్నారు. గృహ వినియోగదారులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న వంట ఏజెన్సీలకు ఇబ్బంది కలగకూడదన్నారు. ముఖ్యంగా హాస్టళ్లలో కొరత రానీయకుండా చూసుకోవాలన్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత మళ్లీ 25 తర్వాతే సిలిండర్ బుకింగ్ చేసుకునేలా కేంద్రం నూతన నిబంధన విధించిందన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లకు డొమెస్టిక్ సిలిండర్లు సరఫరా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఏపీఎంఎస్‌లో ట్యాబ్‌ల మాయంపై ఆర్జేడీ విచారణ
అమరాపురం: మండలంలోని హలుకూరు సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో మూడు నెలల క్రితం 22 ట్యాబ్‌లు అపహరణకు గురైన అంశంపై పాఠశాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ బుధవారం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. డిప్యూటీ డీఈఓ జాన్‌రెడ్డప్పతో కలిసి పాఠశాలకు వెళ్లిన ఆయన.. ట్యాబ్‌లు ఎలా అపహరణకు గురయ్యాయనే అంశంపై బోధన, బోధనేతర సిబ్బందితో మాట్లాడారు. అనంతరం పాఠశాల ఆవరణను పరిశీలించారు. పలు అంశాలపై సిబ్బంది చెప్పిన వివరణను రికార్డు చేసి, నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు శామ్యూల్ తెలిపారు. అనంతరం తరగతి గదికి వెళ్లి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వంద శాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా చదువుకోవాలని సూచించారు.
హత్య కేసులో
నిందితుడికి రిమాండ్
హిందూపురం: దళిత యువకుడిని హతమార్చిన కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు హిందూపురం డీఎస్పీ మహేష్ తెలిపారు. హిందూపురం అప్‌గ్రేడ్ రూరల్ పీఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ వెల్లడించారు. గోళాపురం గ్రామానికి చెందిన దళిత యువకుడు పి.ప్రసన్న కుమార్ 2022లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రసన్నకుమార్ భార్య పవిత్ర.. రిషబ్ మిట్టల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండేది. ఈ క్రమంలో భర్తను ప్రియుడు, అతని స్నేహితులతో కలసి కర్ణాటక సరిహద్దున హత్య చేయించింది. అయితే ఈ కేసు హిందూపురానికి చెందినది కావడంతో అక్కడి పోలీసులు దర్యాప్తును ఇక్కడికి బదిలీ చేశారు. ఈ క్రమంలో పక్కా ఆధారాలతో హతుడి భార్య పవిత్ర, రిషబ్‌మిట్టల్, స్నేహితులు ఒరిశా మకర్, శంబులింగంను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో తప్పించుకుని తిరుగుతున్న ఒడిశాకు చెందిన పపునీ మాలిక్ అలియాస్ బోణి ని బుధవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.


