గ్రంథాలయాలు.. సమస్యల నిలయాలు | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాలు.. సమస్యల నిలయాలు

Mar 7 2026 7:18 AM | Updated on Mar 7 2026 7:18 AM

విజ్ఞాన భాండాగారాలుగా పేర్కొనే గ్రంథాలయాలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస మౌలిక వసతుల కల్పనకు ఆమడదూరంలో ఉంటున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన కొత్త పుస్తకాలను అందించలేక పోతున్నాయి. డిజిటల్‌ గ్రంథాలయాలుగా సాంకేతికతను అందిపుచ్చుకోలేని దుస్థితి కొనసాగుతోంది. ప్రజలు చెల్లించే ఆస్తి పన్ను నుంచి గ్రంథాలయ సెస్సును చెల్లించకపోవడమే ఇందుకు కారణం. దీనికి తోడు ప్రభుత్వం నుంచి నిధులు సైతం సక్రమంగా మంజూరు కాకపోవడం గమనార్హం.

అనంతపురం కల్చరల్‌: పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే చందంగా ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయాలు ఉంటున్నాయి. రాష్ట్రంలోనే జిల్లా కేంద్రంలో తొలి డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పడిందని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడేగానీ సాంకేతిక పరిజ్ఞానమనేదే కనపడదు. నిధుల కొరత కారణంగా ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని స్దితి నెలకొంది.

బడ్జెట్‌ కేటాయింపుల్లో అన్యాయం

గ్రంథాలయాల అభివృద్ధి అంశంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలకు రూ.130 కోట్లు అవసరం కాగా 2025–26 బడ్జెట్‌లో కేవలం రూ.40 కోట్లు మాత్రమే విడుదల చేయడమే ఇందుకు నిదర్శనం. నెలల తరబడి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంటే.. సెస్సు వసూలు చేసుకుని తీసుకోండంటూ ఉచిత సలహా ఇచ్చి చేతులు ఎత్తేసింది. దీంతో సెస్సు బకాయిలు వసూలు కాక, ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్‌ సరిపోక ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో కేంద్ర గ్రంథాలయంతో కలిపి 70 గ్రంథాలయాలు ఉండగా, వీటిల్లో గ్రేడ్‌ 1 స్థానంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం, ధర్మవరం, రాయదుర్గం, గుంతకల్లు, గ్రేడ్‌ – 2 స్థానంలో గుత్తి, ఉరవకొండ, పెనుకొండ, కదిరి, మడకశిర, తాడిపత్రి, కళ్యాణదుర్గం, అనంతపురంలోని ఉమెన్స్‌ లైబ్రరీతో కలిపి మొత్తం 8 ఉన్నాయి. మిగిలిన 58 గ్రంథాలయాలు గ్రేడ్‌ 3 పరిధిలో ఉంటున్నాయి. ఇవి కాక మరో 80 బీసీడీలు (పుస్తక నిక్షిప్త కేంద్రాలు) ఉన్నాయి. బీసీడీల్లోనూ కొన్ని బిల్లులు చెల్లించలేని స్థితిలో మూతపడుతున్నాయి. వీటన్నింటిలో రెగ్యులర్‌ ఉద్యోగులు 71 మంది, ఔట్‌ సోర్సింగ్‌ కింద 21 మంది పనిచేస్తున్నారు. 59 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరి నెల వారి జీతాలతో పాటు కంటెంజెంట్‌, పేపర్‌, ఎలక్ట్రికల్‌ బిల్లులు తదితరాలకు కలపి నెలకు దాదాపు రూ.92 లక్షలు చొప్పున అవసరం అవుతాయి. ఈ లెక్కన ఏడాదికి ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల అవసరాలకు రూ.10.92 కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం కేవలం రూ.4 .40 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఉద్యోగ విరమణ చేసిన వారికి కొంత కాలంగా ఎలాంటి బెనిఫిట్స్‌ అందలేదు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కీలకమైన గ్రంథాలయ సెక్రటరీ పోస్టుతో పాటు గ్రేడ్‌–2లో 3, గ్రేడ్‌ –3లో 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు 1, రికార్డు అసిస్టెంటు పోస్టులు 6, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు 21, వాచ్‌మెన్‌ పోస్టులు 11, ఔట్‌సోర్సింగ్‌ కింద విలేజ్‌ లైబ్రేరియన్‌ పోస్టులు 5 ఖాళీగా ఉన్నాయి.

ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 గ్రంథాలయాలకు శాశ్వత భవనాలున్నాయి. ఇందులో అనంతపురంలో 20, శ్రీసత్యసాయి జిల్లాలో 24 ఉన్నాయి. ఫ్రీ రెంట్‌ భవనాలు అనంతలో 10, శ్రీసత్యసాయి జిల్లాలో 7 చొప్పున మొత్తం 17 ఉన్నాయి. అద్దెతో నడుస్తున్న గ్రంథాలయాలు మొత్తం 9 ఉన్నాయి. ఇందులో నాలుగు అనంతపురం జిల్లాలో, 5 శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో ఉన్నాయి. వీటన్నింటి నెలసరి అద్దె సుమారు రూ.30 వేలకు పైగా ఉంటుంది.

పంచాయతీలు, నగర, పురపాలికల్లో ఏటా వసూలు చేసే ఆస్తి పన్నులోనే 8 శాతం గ్రంథాలయ సెస్సు విధిగా ఉంటుంది. వీటిని జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాకు జిల్లా పంచాయతీ శాఖ, నగర, పురపాలికలు జమ చేయాల్సి ఉంది. ఈ సెస్సు నిధులతోనే గ్రంథాలయాల్లో అభివృద్ధి పనులు, మరమ్మతులు, అవసరమైన మేరకు శాశ్వత భవనాలు, గదుల నిర్మాణం చేపడుతుంటారు. దిన, వార, మాస పత్రికలు, కుర్చీలు, టేబుళ్లు, అట్టలు, పార్ట్‌టైం ఉద్యోగుల జీతాలు, విద్యుత్తు బిల్లులూ చెల్లిస్తుంటారు. అయితే సెస్సు చెల్లింపుల్లో ఆయా సంస్థలు నిర్లక్ష్యం వహిస్తుండడంతో గ్రంథాలయాలకు నిధుల కొరత ఏర్పడుతోంది.

జీతాలకే దిక్కు లేక అల్లాడిపోతున్న ఉద్యోగులు

స్పష్టంగా కనపడుతున్న నిర్వహణా లోపం

ఆస్తి పన్నులో 8 శాతం

ఖాళీలు బోలెడు

శాశ్వత భవనాలూ కరువే

అసంతృప్తిలో ఉద్యోగులు

సెస్సు బకాయిలు చాలా ఉన్నాయి

జీతభత్యాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న మాట వాస్తవం. ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి. ఉమ్మడి జిల్లా పరిధిలో మున్సిపాలిటీలు, పంచాయతీల ద్వారా ఈ ఏడాది మార్చి వరకు రూ.10.80 కోట్ల మేర సెస్సు బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సెస్సు వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం.

– కమ్మన్న ,సెక్రటరీ, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement