కి‘లేడీల’ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కి‘లేడీల’ అరెస్ట్‌

Mar 7 2026 7:18 AM | Updated on Mar 7 2026 7:18 AM

రూ 5.65 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.75 వేల నగదు స్వాధీనం

కదిరి టౌన్‌: స్థానిక బస్టాండు ప్రాంతంలో సంచరిస్తూ ప్రయాణికుల దృష్టి ఏమార్చి నగలు, నగదు అపహరిస్తున్న ముగ్గురు మహిళలను అరెస్ట్‌ చేసినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. పట్టణ పీఎస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ వి.నారాయణరెడ్డి, ఎస్‌ఐ భువనేశ్వరితో కలసి ఆయన వెల్లడించారు. కదిరి ఆర్టీసీ బస్టాండ్‌ పరిసరాల్లో గత 5 నెలలుగా వరుసగా పర్సులు, బంగారు ఆభరణాల చోరీలు జరిగాయి. ఆయా ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు నిఘా విస్తృతం చేశారు. ఈ క్రమంలో సీఐ వి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐలు బాబ్జాన్‌, భువనేశ్వరి, హెడ్‌ కానిస్టేబుల్‌ జాకీర్‌ హుస్సేన్‌, శివశంకర్‌రెడ్డి శుక్రవారం గస్తీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ముగ్గురు మహిళలను గుర్తించి, వారిని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వారు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించడంతో వెంటాడి అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. విచారణలో చోరీలను వారు అంగీకరించారు. పట్టుబడిన వారిలో తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌లోని చంద్రబాబు కాలనీకు చెందిన మల్లెల గంగ, దేవరకొండ అంజలి, సోమందేపల్లిలోని మారుతీకాలనీ నివాసి కాల్వపల్లి భూదేవి ఉన్నారు. వీరి నుంచి రూ.5.65 లక్షల విలువైన బంగారు నగలు, రూ.75 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

10 ఎకరాల్లోని మామిడి తోట దగ్ధం

హిందూపురం: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో దాదాపు 10 ఎకరాల్లోని మామిడి తోట దగ్ధమైంది. బాధితులు తెలిపిన మేరకు.. హిందూపురం మండలం బాలంపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు నారాయణమ్మకు చలివెందుల గ్రామ రెవెన్యూ పరిధిలో 10 ఎకరాల మామిడి తోట ఉంది. సీజన్‌ మొదలు కావడంతో పంట ఆశాజనకంగా ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తోటకు సమీపంలోని ఎండు గడ్డికి నిప్పు రాజేశారు. దీంతో మంటల చెలరేగి తోటను చుట్టుముట్టాయి. మూడు ఎకరాల్లోని మామిడి చెట్టన్నీ కాలిపోయాయి. మిగిలిన చెట్లు పాక్షికంగా మాడిపోయాయి. ఘటనతో రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని, పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ బాధిత మహిళా రైతు కన్నీటి పర్యమైంది. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement