పుట్టపర్తి టౌన్: నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను కలెక్టర్ శ్యాం ప్రసాద్ హెచ్చరించారు. శుక్రవారం కొత్తచెరువులోని జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న కిరాణా దుకాణాన్ని కలెక్టర్ తనిఖీ చేసి, దుకాణదారులతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గంజాయి, గుట్కా చైనీఖైనీ వంటి పదార్థాల విక్రయాలను నిషేధించిందన్నారు. విద్యా సంస్థలున్న పరిసరాల్లో ఇలాంటి పదార్థాల విక్రయాలను పూర్తిగా నిషేధించాలన్నారు. చట్టానికి విరుద్ధంగా విక్రయించినా, రవాణా చేసిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జ్యోతిర్లింగాల దర్శనం కోసం సైకిల్ యాత్ర
ఉరవకొండ రూరల్: చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన యువకుడు వినయ్ దేశంలోని 12 జ్యోతిర్లింగాల దర్శనం కోసం సైకిల్ యాత్ర చేపట్టాడు. గత ఏడాది ఏప్రిల్ 15న చేపట్టిన ఈ యాత్ర శుక్రవారం చిన్నముష్టూరు సమీపంలోకి చేరుకుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించింది. ఇప్పటి వరకూ 10 జ్యోతిర్లింగాల దర్శనం పూర్తి చేసినట్లు వినయ్ వివరించాడు. ప్రస్తుతం రామేశ్వరం వెళుతున్నానని పేర్కొన్నాడు. మార్గ మధ్యంలోని ఆలయాల్లో పెట్టే అన్న దానం, ప్రజలు ఇచ్చే ఆహారంతో యాత్ర సాగిస్తున్నట్లు తెలిపాడు.
ఆటో బోల్తా – నలుగురికి గాయాలు
కళ్యాణదుర్గం రూరల్(కంబదూరు): ఆటో బోల్తాపడిన ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. మండల కేంద్రం కంబదూరులోని చెరువు కట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతపురానికి చెందిన పలువురు తమ బంధువుల ఇంటికని ఆటోలో వస్తుండగా చెరువు కట్ట వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి ఆటో దూసుకెళ్లి బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న రాజు, ఉమాపతి, రాఘవేంద్ర, లక్ష్మీదేవి గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తరలించారు.


