కదిరి: పురాణాల ఆధారంగా స్వయం సర్వాంతర్యామి అయిన ఆ శ్రీమన్నారాయణుడే ఉగ్ర నరసింహుడి అవతారంలో నడయాడిన దివ్య భూమిగా కదిరి ఖ్యాతి గాంచింది. హిరణ్య కశ్యపుడిని సంహరించిన అనంతరం నరసింహాస్వామి ఉగ్రరూపంలో కదిరి కొండపై కాలు పెట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ పర్వతానికి ‘స్తోత్రాద్రి’ అనే పేరు వచ్చిందని అందులో పేర్కొన్నారు. ఆ సమయంలో స్వామి వారు అక్కడ మోపిన పాదాల గుర్తులు నేటికీ భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నాయి. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి పాదాలు తాకాలంటే కదిరి–రాయచోటి రహదారిలో పట్టణానికి 2 కి.మీ. దూరంలో ఉన్న కదిరి కొండకు వెళ్లాల్సిందే. నిర్మలమైన మనస్సుతో స్వామివారి పాదాలను తాకి, మనసులో ఆరాధిస్తే సంసార దుఃఖ బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం నాడు కదిరి నుంచి ఎంతోమంది భక్తులు కదిరి కొండ వద్దకెళ్లి గిరి ప్రదక్షిణ చేసి అక్కడున్న కొండల నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


