వక్ఫ్‌భూముల జోలికొస్తే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌భూముల జోలికొస్తే ఊరుకోం

Feb 10 2026 8:08 AM | Updated on Feb 10 2026 8:08 AM

వక్ఫ్‌భూముల జోలికొస్తే ఊరుకోం

వక్ఫ్‌భూముల జోలికొస్తే ఊరుకోం

పుట్టపర్తి అర్బన్‌: వక్ఫ్‌బోర్డు భూముల జోలికొస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని ముస్లింలు హెచ్చరించారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి పనుల పేరిట వక్ఫ్‌భూములను స్వాధీనం చేసుకుని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్‌ ఆధ్వర్యంలో ముస్లింలు కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డికి వినతి పత్రం అందజేసి వక్ఫ్‌బోర్డు భూములు పరాధీనం కాకుండా సంరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్‌ నాయకులు మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయానని మండిపడ్డారు. అలాగే మైనార్టీల ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. ఈక్రమంలోనే సీఎం చంద్రబాబు వక్ఫ్‌ భూములను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నారన్నారు. అందులో భాగంగానే మంగళగిరిలోని 71.57 ఎకరాల వక్ఫ్‌బోర్డు భూములను ప్రభుత్వ భూములుగా మార్చిందన్నారు. ఈ విషయంలో వక్ఫ్‌బోర్డుకు గానీ, ఆ భూములను పర్యవేక్షిస్తున్న అంజుమన్‌– ఆ– ఇస్లామియా సంస్థకు గాని కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. ఇదే తరహాలో మంగళగిరి ప్రాంతానికి సమీపంలోని మల్లయ్యపాలెంలో 232 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. వక్ఫ్‌బోర్డుకు ఇప్పటివరకూ ఎకరా భూమి కేటాయించని చంద్రబాబు...ఎప్పుటినుంచో వక్ఫ్‌బోర్డు ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. పేద ముస్లింలకు, విద్యార్థులకు, మసీదులకు, పాఠశాలలకు, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉపయోగపడే వక్ఫ్‌భూములను స్వాధీనం చేసుకుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. అలాకాకుండా వక్ఫ్‌ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు.

ఒక్కహామీ నెరవేర్చలేదు..

చంద్రబాబు ఎన్నికల సమయంలో ముస్లింలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని మైనార్టీసెల్‌ నాయకులు మండిపడ్డారు. దుల్హన్‌ పథకానికి దిక్కులేదని, వడ్డీ లేని రుణాలు ఊసేలేదని, మసీదులు మరమ్మత్తులకు పైసా ఇవ్వలేదని మైనార్టీలు మండిపడ్డారు. శ్మశాన వాటికలకు ప్రహరీలు, స్థలాలను కేటాయిస్తామని చెప్పి రెండేళ్లవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇవన్నీ చేయకపోగా వక్ఫ్‌ భూములను పీపీపీకి ఇస్తామంటున్నారని, పీపీపీ అంటే పేద ప్రజల పీక పిసికే పార్టీ అని ఎద్దేవా చేశారు. మైనార్టీలమంతా ఏకమై భూములను రక్షించుకుంటామన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ముస్లిం, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు చాంద్‌బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అమానుల్లా, నిషార్‌ అహ్మద్‌, రాష్ట్ర కార్యదర్శులు ఎన్‌హెచ్‌ బాషా, మున్వర్‌ బాష, మున్సిపల్‌ విభాగం సంయుక్త కార్యదర్శులు ఫారుఖ్‌, అసిఫుల్లా, మైనార్టీ విభాగం లేపాక్షి మండల కన్వీనర్‌ నిసార్‌ అహమ్మద్‌, హిందూపురం మండల కన్వీనర్‌ మన్సూర్‌ ఖాన్‌, మడకశిర మండల కన్వీనర్‌ సికిందర్‌, పబ్లిసిటీ వింగ్‌ జిల్లా కార్యదర్శి చాంద్‌బాషా, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ షాజహాన్‌, హిందూపురం మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ సలాం, ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ షంషీర్‌, నీలకంఠాపురం ఇన్‌చార్జ్‌ చాంద్‌బాషా, కొండకమర్ల మైనార్టీ లీడర్‌ బాబ్జాన్‌, మడకశిరకు చెందిన అన్సార్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు సర్కార్‌ను

హెచ్చరించిన ముస్లింలు

వైఎస్సార్‌ సీపీ మైనార్టీ సెల్‌

ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement