బాలిక కిడ్నాప్‌.. భయంతో వదిలేశారు! | - | Sakshi
Sakshi News home page

బాలిక కిడ్నాప్‌.. భయంతో వదిలేశారు!

Feb 10 2026 8:08 AM | Updated on Feb 10 2026 8:08 AM

బాలిక కిడ్నాప్‌..  భయంతో వదిలేశారు!

బాలిక కిడ్నాప్‌.. భయంతో వదిలేశారు!

తనకల్లు: బాలికను కిడ్నాప్‌ చేసిన ఇద్దరు యువకులు స్థానికులను చూసి భయపడి చిన్నారిని వదిలి పారిపోయారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఆదివారం సాయంత్రం తమ దుకాణం నుంచి ఇంటికి వెళ్తుండగా.. గుర్తు తెలియని ఇద్దరు యువకులు బైక్‌లో కిడ్నాప్‌ చేశారు. కొంతదూరం తీసుకువెళ్లిన తర్వాత మార్గమధ్యంలో కొందరు వ్యక్తులు మద్యం తాగుతూ కనిపించడంతో భయపడిన యువకులు... బాలికను అక్కడే వదిలివేసి వెళ్లిపోయారు. ఈ విషయంపై సోమవారం బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.

కాచిగూడ–తిరుపతి మధ్య వన్‌ వే స్పెషల్‌ ట్రైన్‌

గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని కాచిగూడ–తిరుపతి మధ్య ఈ నెల 12న వన్‌ వే స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ ఎ.శ్రీధర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు (07511) 12వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు తిరుపతి రైల్వే జంక్షన్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ రైలు ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్డు, గద్వాల, కర్నూలు సిటీ, డోన్‌, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట రైల్వేస్టేషన్ల మీదుగా తిరుపతికి చేరుకుంటుందని తెలిపారు. ఇందులో 3ఏ, చైర్‌ కార్‌, జనరల్‌, సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అప్పరాచెరువులో

హిటాచీ సీజ్‌

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: బత్తలపల్లి మండలంలోని అప్పరాచెరువు గ్రామ సమీపంలోని రాళ్ల గుట్ట వద్ద అక్రమంగా మట్టిని తవ్వుతున్న హిటాచీ యంత్రాన్ని అధికారులు సీజ్‌ చేశారు. రైతుల ముసుగులో కొందరు కూటమి నాయకులు చెరువులోని సారవంతమైన మట్టిని విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. గ్రామస్తుల సమాచారంతో రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు అధికారులు ఆదివారం రాత్రి అప్పరాచెరువులో దాడులు నిర్వహించారు. చెరువులో అక్రమంగా మట్టిని తవ్వేందుకు ఉంచిన హిటాచీని సీజ్‌ చేశారు. తనిఖీల్లో తహసీల్దార్‌ స్వర్ణలత, డిప్యూటి తహసీల్దార్‌ షణ్ముఖ కుమార్‌ యాదవ్‌, మైనింగ్‌ రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ ఖాజావలి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పురుషోత్తం తదితరులు ఉన్నారు.

అనుమతులు టీడీపీ వాళ్లకేనా..?

అప్పరాచెరువులో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెరువులోని మట్టిని అక్రమంగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే అధికారులు కేవలం బీజేపీ నేతలకు చెందిన హిటాచీని మాత్రమే సీజ్‌ చేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ, జనసేన నేతల వాహనాలను వదిలి తమ వాహనాన్నే సీజ్‌ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక పోట్లమర్రి చెరువులో మట్టిని తరలించేందుకు అనుమతులు లేవని తమకు చెప్పిన అధికారులు... టీడీపీ వారికి ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి సత్యకుమార్‌ వద్దే తేల్చుకుంటామంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement