ప్రతి అర్జీకి పరిష్కారం చూపండి
ప్రశాంతినిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ల అందే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వాస్తవ విషయాలు తెలుస్తాయని, అప్పుడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’కు వివిధ సమస్యలపై మొత్తంగా 293 అర్జీలు అందాయి. అర్జీలను స్వీకరించిన జేసీ..వాటిని పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు పంపారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా చూసుకోవాలన్నారు.
రూ.15 వేల పింఛన్ ఇవ్వండి..
నాకు చిన్నప్పటి నుంచే కాళ్లు, వెన్నుపూస దెబ్బ తినడంతో వీల్ చైర్‌కే పరిమితమయ్యా. 90 శాతం వైకల్యం ఉన్నట్లు అధికారులు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అయినా రూ.6 వేల పింఛనే ఇస్తున్నారు. వృద్ధులైన నా తల్లిదండ్రులు కూడా ఏ పనీ చేసుకోలేని పరిస్థితిలో నాకొచ్చే పింఛన్‌పైనే ఆధారపడి బతుకుతున్నారు. నాపై దయచూపి రూ.15 వేల పింఛన్ మంజూరు చేయండి.
– ఆకుతోట మురళి, పెడపల్లి, పుట్టపర్తి మండలం
రోడ్డు వేయించండి
సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి జాతీయ రహదారి–342 వరకూ 4 కిలోమీటర్లు మేర తారురోడ్డు లేదు. గుంతలమయమైన ఆ రోడ్డుపై ప్రయాణం ఇబ్బందిగా మారింది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు వాహనాలపైనుంచి కిందపడి గాయపడ్డారు. ఏదైనా తీవ్ర ప్రమాదం జరిగితే విద్యార్థి జీవితం నష్టపోవాల్సి వస్తుంది. వెంటనే తారు రోడ్డు వేసి సమస్య పరిష్కరించాలి.
– సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు
అధికారులకు జేసీ
మౌర్య భరద్వాజ్ ఆదేశం
‘పరిష్కార వేదిక’కు 293 అర్జీలు
ప్రతి అర్జీకి పరిష్కారం చూపండి


