సాగునీటి సంకటం తీర్చండి
అనంతపురం అర్బన్: ‘తుంపెర డీప్‌కట్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఆటంకం కల్పించిన కారణంగా ఏకంగా 883 ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందికి గురవుతున్నారు. దీనిపై విచారణ చేసి రైతులకు నీరు అందేలా చర్యలు తీసుకోండి’ అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనంతపురం ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మను కోరారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఇన్‌చార్జ్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితి వివరించారు. అనంతరం కేతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తుంపెర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 11 క్యూసెక్కుల నీటిని తోడుకునేందుకు ప్రభుత్వం 1984లో జీఓ 443 జారీ చేసిందన్నారు. దీనిద్వారా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం రామాపురం గ్రామంలో 532 ఎకరాలు, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండలం ముచ్చుకుంటపల్లి గ్రామంలో 351 ఎకరాలకు నీరందించాల్సి ఉందన్నారు. యల్లనూరు, పుట్లూరు మండలాలకు ఇబ్బంది లేకుండా కొన్ని పైపులు ద్వారా నీటిని తరలించేవారమన్నారు. అయితే అక్కడి రైతులు ఈ పైపులను తొలగించడంతో లిఫ్ట్‌ను పూర్తిగా మూసి వేశారన్నారు. దీనివల్ల కింద ఉన్న రామాపురం, చిన్నకొండయ్యపల్లి, కునుకుంట్ల గ్రామాలకు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం నెలకొందన్నారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి రెండు రోజుల్లోగా సమస్యను పరిష్కరించి నీరు సరఫరా చేయిస్తామన్నారని కేతిరెడ్డి వెల్లడించారు.
చంద్రబాబు సర్కార్
అన్ని విధాలా విఫలమైంది..
రాష్ట్రంలోని చంద్రబాబు సర్కార్ అన్ని విధాలా విఫలమైందని కేతిరెడ్డి ధ్వజమెత్తారు. సాగునీటి విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా.. ఇక్కడి ప్రజాప్రతినిధులు మాట్లాడలేని దయనీయస్థితిలో ఉన్నారన్నారు. ప్రజలను ఏదో ఒక విధంగా మభ్యపెట్టడం, మోసం చేయడం అనే ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చందబ్రాబు ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లవుతున్నా... ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ‘‘నేను, చంద్రబాబు ప్రత్యేకంగా ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాము’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారని, అది కూడా కేంద్రంతో చెప్పించి ఆపించే కార్యక్రమం చేయించామని ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. మరి రాయలసీమ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ ఇక్కడి వారు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.
త్వరలోనే ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’..
ప్రజా సమస్యలపై త్వరలోనే ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ చేపడతానని కేతిరెడ్డి వెల్లడించారు. ‘‘దాని మీద ఏడ్చేవాళ్లు కూడా ఉంటారు. అవీఇవీ అంటూ ఆరోపణలు చేస్తూ గతంలో ఏడ్చిన వాళ్లకి అప్పుడే చెప్పాను. మీవద్ద ఏమైనా ఉంటే చూపించండని. ఇప్పటి వరకు చూపించలేదు. వాళ్ల గురించి పట్టించుకోను. నేను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ప్రజల కోసం పనిచేస్తా’’ అని అన్నారు. కేతిరెడ్డి వెంట రామాపురం సర్పంచ్ పుల్లయ్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వడ్డి గోపాల్‌రెడ్డి, సల్లాపురం బాలరమణారెడ్డి, యలక శ్రీనివాసరెడ్డి, వడ్డి లింగారెడ్డి, వెంకటరెడ్డి, ఈశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జొల్లిరెడ్డి అశ్వర్థ, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం ఇన్‌చార్జ్ కలెక్టర్‌ను కోరిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
883 ఎకరాలకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడి
ప్రజా సమస్యలపై త్వరలోనే
గుడ్ మార్నింగ్ ధర్మవరం’
తొడగొట్టుకోవడం తప్ప
ఏమీ చేయలేకపోతున్నాం..
‘‘మన దగ్గర ఉన్న ఎయిమ్స్ పోయింది. కర్నూలుకు వచ్చిన లా యూనివర్సిటీ పోయింది. హైకోర్టు పోయింది. అన్నీ అమరావతిలో పెడుతున్నారు. మనమేమో రాయలసీమ.. రాయలసీమ అంటూ తొడగొట్టుకోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. లేని పౌరుషాల పేరుచెప్పుకుని ఉప్పు కారం తింటున్నాం. ఇన్ని ప్రాజెక్టులు పోతున్నా, మనకు ఇంత అన్యాయం జరుగుతున్నా... మాట్లాడలేని దయనీయ పరిస్థితిలో ప్రజాప్రతినిధులు..అందరం ఉన్నాం.’’ అని కేతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనవసర విషయాలపై గంటల తరబడి మాట్లాడే రాయలసీమ ప్రజాప్రతినిధులు...మనకు నీళ్లు రాకుండా ఆపుతున్నారనే అనేదాన్ని నోరు మెదపలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారన్నారు.


