మానవత్వంతో ప్రజా సమస్యలు పరిష్కరించండి
● అధికారులతో కలెక్టర్ శ్యాం ప్రసాద్
● ‘పరిష్కార వేదిక’కు 492 అర్జీలు
పుట్టపర్తి అర్బన్: ‘‘కలెక్టరేట్‌కు వెళ్లి అర్జీ ఇస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశతో జిల్లా నలుమూలల నుంచి జనం వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడి వరకూ వస్తారు. తమ సమస్యలపై అర్జీలిస్తారు. వాటిని మానవత్వంతో పరిశీలించి పరిష్కరించాలి’’ అని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 492 అర్జీలు అందాయి. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి పరిష్కరించాలన్నారు.
అందిన అర్జీల్లో కొన్ని..
● పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లిలో మురుగునీళ్లు రోడ్లపై పారుతున్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామానికి చెందిన గంగాధర్ కలెక్టర్‌కు విన్నవించారు. నెలల తరబడి అపరిశుభ్రత నెలకొని ఉండడంతో వృద్ధులు, చిన్నారులు జారి పడుతున్నారన్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
● టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తనకు వచ్చే పింఛన్ ఆగిపోయిందని తలుపుల మండలం సిద్దగూరిపల్లికి చెందిన మరియమ్మ కలెక్టర్‌కు విన్నవించారు. పింఛనే తనకు జీవనాధారమని, వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
మా స్థలాలను
టీడీపీ నేతలు కబ్జా చేశారు
● రెవెన్యూ అధికారులకు
గుంతపల్లి దళితుల ఫిర్యాదు
కనగానపల్లి: ‘‘ఏళ్లుగా మా ఆధీనంలో ఉన్న భూములను టీడీపీ నేతలు కబ్జా చేశారు. జేసీబీలను దించి భూమిని చదును చేయిస్తున్నారు. మీరే మాకు న్యాయం చేయాలి’’ అని గుంతపల్లి ఎస్సీ కాలనీవాసులు సోమవారం తహసీల్దార్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిప్పన్న, సూరి, చిన్నప్ప, హనుమంతు మాట్లాడుతూ... 25 సంవత్సరాలు క్రితం ఏర్పడిన ఎస్సీ కాలనీకి పక్కనే సర్వే నంబరు 487–2లోని స్థలంలో దళితులు, గిరిజనులు, బీసీలు కల్లాలు, పశువుల పాకలు వేసుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆక్రమించి జేసీబీలతో చదును చేయిస్తున్నారని, అడ్డుకొనేందుకు వెళ్లిన తమను దుర్భాషలాడుతూ దాడికి దిగారన్నారు. స్థలాన్ని ఆక్రమణకు గురికాకుండా చూడాలని వారు కోరారు.
మానవత్వంతో ప్రజా సమస్యలు పరిష్కరించండి


