నిధులివ్వలేదు.. నీరూ తేలేదు!
రామగిరి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేరోందిన అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ (పేరూరు డ్యాం)కు నీరొస్తే ఉభయ జిల్లా వాసులకు తాగు, సాగునీటికి ఢోకా ఉండదు. అయితే ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పటి వరకూ కేవలం ఓటు బ్యాంక్‌గానే పరిటాల కుటుంబం వాడుకుంటూ పబ్బం గడుపుకుంటోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ పేరూరు డ్యాంకు నీరు తీసుకొస్తామని హామీనిచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిటాల సునీత... రెండేళ్లు పూర్తయినా నేటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదు. డ్యాంకు చుక్కనీరు అందకపోవడంతో వట్టిపోయింది. అంతేకాక గేట్ల మరమ్మతు పేరుతో ఉన్న అర టీఎంసీ నీటిని కూడా వృధాగా దిగువకు వదిలేయడంతో పంటలు సాగుకు నీరందక రైతులు, తాగేందుకు నీరులేక పలు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
పదేళ్లు దాటినా... అలాగే
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో పేరూరు డ్యాంకు హంద్రీ–నీవా కాలువ నుంచి కృష్ణా జలాలను తీసుకువస్తామని పరిటాల సునీత స్పష్టమైన హామీనిచ్చారు. గెలిచిన తర్వాత మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే డ్యాంకు నీటిని మళ్లించేందుకు అప్పట్లో హడావుడిగా రైతుల నుంచి బలవంతంగా వందల ఎకరాల భూమిని సేకరించారు. వీరిలో కొందరికి మాత్రమే పరిహారం అందింది. పదేళ్లు దాటినా కాలువ పూర్తి కాలేదు.. మిగులు నిర్వాసితులకు పరిహారమూ అందలేదు. చంద్రబాబు ప్రభుత్వం మొండి చెయ్యి చూపడంతో నిధులు అందక నిర్వాసితులకు పరిహారం అందకుండా పోయింది. దీంతో ఉన్న భూమిని కోల్పోయి చాలామంది రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రశ్నిస్తే ఎలాంటి దారుణాలను చవిచూడాల్సి వస్తోందోననే భయం అందరిలోనూ వెన్నాడుతుండడంతో ఆ సాహసం చేయలేక మౌనంగా ఉండిపోయారు.
దుబ్బార్లపల్లివద్ద పేరూరు బ్రాంచ్ కెనాల్ కోసం రైతుల భూముల్లో తవ్విన కాలువ
పేరూరు డ్యాంకు నీరందించేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో తవ్విన కాలువ
ఉన్న నీటిని దిగువకు వదిలి..
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో వరుణుడు కరుణించడంతో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీనికి తోడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నిలబెట్టుకుని కర్ణాటక మీదుగా పేరూరు డ్యాంను నీటితో నింపారు. 2023 నాటికి పేరూరు డ్యాం నీటితో నిండుకుండలా మారింది. డ్యాం ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో డ్యాంలోకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా వంద రోజుల పాటు డ్యాం 8 గేట్లనూ పైకెత్తి దిగువన పెన్నానదికి నీటిని వదలాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికై న పరిటాల సునీత గత సెప్టెంబర్ మాసంలో డ్యాం గేట్ల మరమ్మతు పేరుతో ఉన్న నిటీని దిగువకు వదిలేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత డ్యాంకు చుక్క నీరు అందకుండా పోవడంతో ప్రస్తుతం డ్యాంలో నీరు పూర్తిగా అడుగంటింది. ఫలితంగా రానున్న వేసవిలో తాగేందుకు గుక్కెడు నీరు లేక గ్రామాలను వదలాల్సిన పరిస్థితులు నెలకొంటాయనే అనుమానాలను గ్రామీణులు వ్యక్తం చేస్తున్నారు.
‘పేరూరు’ నిర్వాసితులకు అందని పరిహారం
2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో డ్యాం సబ్‌బ్రాంచ్ కాలువకు
బలవంతపు భూసేకరణ
పదేళ్లు దాటినా నేటికీ అందని పరిహారం
ఆయకట్టుకు నీరివ్వడంలో ‘పరిటాల’ విఫలం
నిధులివ్వలేదు.. నీరూ తేలేదు!
నిధులివ్వలేదు.. నీరూ తేలేదు!


