అంజన్న సేవలో కలెక్టర్
నల్లచెరువు: ప్రసిద్ధి చెందిన పాలపాటిదిన్నె ఆంజనేయస్వామిని మంగళవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించారు. ఆలయ అధికారులు కలెక్టర్‌కు ఆలయ మర్యాదలతో పూలమాలలు, శాలువాలతో ఘనంగా స్వాగతం పలికారు. తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపట్టాన్ని అందజేశారు. తహసీల్దార్ రవినాయక్, వీఆర్వో నీలకంఠరెడ్డి, వీఆర్‌ఐ లక్ష్మీపతి, ప్రధాన అర్చకులు ఆంజనేయ దాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పట్నం పీహెచ్‌సీ తనిఖీ
కదిరి అర్బన్: మండల పరిధిలోని పట్నం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలను రోగులతో అడిగి తెలుసుకున్నారు. పనివేళలు పాటించాలని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణాన్ని పరిశీలించారు. దాతలు ముందుకు రావడంతో ఆస్పత్రిలో అదనపు వసతుల నిర్మాణాలకు సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. ఆమె వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగేంద్రనాయక్, డాక్టర్ వినోద్, సర్పంచ్ చలపతినాయక్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
ముదిగుబ్బ: మండల పరిధిలోని మలకవేమలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, వ్యాక్సిన్, లేబర్, ఓపీ రూములను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ నాగేంద్ర నాయక్, ఎంపీహెచ్‌ఈఓ వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీహెచ్‌ఎస్ అలివేలమ్మ, సిబ్బంది వినయ్‌కుమార్, మహబూబ్‌బాషా, గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.
బీటెక్ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో అక్టోబర్ నెలలో నిర్వహించిన బీటెక్ నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–20) రెగ్యులర్, సప్లిమెంటరీ, (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు, సీఈ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి.శంకర్ శేఖర్‌రాజు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఎం.అంకారావు పాల్గొన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చన్నారు.
నేటి నుంచి పింఛన్ల పంపిణీ
పుట్టపర్తి అర్బన్: ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు బుధవారం నుంచి పింఛన్లు అందజేయనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 2,62,533 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.115.51 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే సచివాలయ సిబ్బంది ఆ మొత్తాన్ని బ్యాంకుల నుంచి డ్రా చేసి సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. జనవరి 2వ తేదీ వరకూ పింఛన్ల పంపిణీ కొనసాగుతుందన్నారు.
జనవరి రెండో వారం నుంచి కంది కొనుగోళ్లు
ప్రశాంతి నిలయం: ఏపీ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో కంది పంటను కనీస మద్దతు ధర రూ.8 వేలతో కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు చేసినట్లు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ గీతమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి రెండో వారం నుంచి కంది కొనుగోలు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రభుత్వానికి కందులను విక్రయించాలనుకునే రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లను, వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఈ క్రాప్ నమోదు చేయించిన రైతుల పంట మాత్రమే అధికారులు కొనుగోలు చేస్తారని స్పష్టం చేశారు. కంది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అంజన్న సేవలో కలెక్టర్
అంజన్న సేవలో కలెక్టర్


