అర్హులందరికీ ఉచిత న్యాయ సేవలు
హిందూపురం: అర్హులైన ప్రతి ఖైదీకి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. మంగళవారం స్థానిక సబ్‌జైలును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అలాగే సబ్‌జైలులో రిమాండ్ ఖైదీలకు అందించే ఆహార పదార్థాలు, తయారు చేసేందుకు తీసుకొచ్చిన నిత్యావసరాల నాణ్యతను పరిశీలించారు. జైలులో ఫిర్యాదులు పెట్టే, తాగునీటి నాణ్యత, ఆహార పదార్థాల నాణ్యతలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రిమాండ్ ఖైదులతో నేరుగా మాట్లాడారు. ఏఏ నేరాలు చేసి జైలుకు వచ్చారు, ఎంతకాలం నుంచి శిక్ష అనుభవిస్తున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఉండి న్యాయవాదులను ఏర్పాటు చేసుకునే స్తోమతలేని ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. అలాంటి ఖైదీలు తెల్లకాగితంపై దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం న్యాయ సహాయం కోసం ఉన్నత న్యాయస్థానం విడుదల చేసిన టోల్ ఫ్రీ నంబర్ల కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో సబ్‌జైలు అధికారి హనుమన్న, న్యాయవాది నవేరా, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి, పారా లీగల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ
కార్యదర్శి రాజశేఖర్


