ఉపాధి పనులు పక్కాగా అమలు చేయాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు, నీటి సంరక్షణ కార్యక్రమాలు, ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణను పక్కాగా నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా డ్వామా, ఇరిగేషన్, భూగర్భ జలాలు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, హెచ్చెల్సీ అధికారులతో కలెక్టర్ జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న ఉపాధి పనులు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా చేపట్టాలన్నారు. పనులకు సంబంధించిన రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు.
వందశాతం పూర్తి చేయాలి..
జిల్లాలో అర్హులైన వారందరికీ బుధవారం నుంచి పింఛన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో అధికారులకు సూచించారు. వందశాతం పింఛన్లను పంపిణీ చేయాలన్నారు. పింఛన్ల పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవకతవకలు, లోటుపాట్లు చోటు చేసుకుంటే బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
బోకేలు తీసుకురావద్దు..
నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే అధికారులు, ప్రజా ప్రతినిధులు , వివిద సంస్థల ప్రతినిధులు పూల బోకేలు, శాలువాలు, పండ్లు వంటి సంప్రదాయ బహుమతులు తీసుకురావద్దని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వాటి బదులు జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు, ఆస్పత్రుల్లో రోగులకు ఉపయోగపడే బెడ్‌షీట్లు, కార్పెట్లు, క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికి పోషకాహార కిట్లు అందజేయాలని కోరారు.
యోగి వేమన సమాధిని సందర్శన..
గాండ్లపెంట: మండల పరిధిలోని కటారుపల్లిలోని విశ్వకవి యోగి వేమన సమాధిని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ మంగళవారం సందర్శించారు. ఆలయ పీఠాధిపతి తుంగ నందవేమారెడ్డి ఆయనకు స్వాగతం పలికి ఆలయ విశిష్టతను తెలియజేశారు.
కేజీబీవీ తనిఖీ..
కటారుపల్లి క్రాస్ సమీపంలోని కేజీబీవీని కలెక్టర్ శ్యాంప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల ఆవరణలో చదువుకుంటున్న బాలికలతో మాట్లాడుతూ 10వ తరగతి వంద రోజుల ప్రణాళికపై అడిగి తెలుసుకున్నారు. విద్యాలయంలో భోజన, నీటి సౌకర్యం, మరుగుదొడ్లను పరిసరాలను పరిశీలించారు. అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నారా అని ఆరా తీశారు. అలాగే ఇంటర్ విద్యార్థులతో మాట్లాడి పాఠ్యంశాలపై అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్


