54 హత్యలు.. 87 పోక్సో కేసులు
పుట్టపర్తి టౌన్: జిల్లాలో నేరాల సంఖ్య పెరిగింది. గత ఏడాది కన్నా ఈ ఏడాది క్రైం రేటు పెరిగినట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలియజేశారు. మంగళవారం పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా మహవీర్‌తో కలిసి ఎస్పీ సతీష్ కుమార్ 2025 వార్షిక నేర నివేదికను వెల్లడించారు.
పెరిగిన హత్య కేసులు..
గత ఏడాది 3,947 నేరాలు నమోదు కాగా ఈ ఏడాది అదికాస్తా 4028కి పెరిగిందని ఎస్పీ సతీష్ తెలియజేశారు. గత ఏడాది 52 హత్యలు జరగ్గా ఈ ఏడాది 54 హత్యలు జరిగాయన్నారు. అలాగే అల్లర్లు 17, కిడ్నాపులు 25, తీవ్రమైన మనోవేదన కేసులు 43, స్వల్పమైన మనోవేదన కేసులు 662, హత్యాయత్నం కేసులు 93 నమోదైనట్లు పేర్కొన్నారు. అలాగే మహిళలకు సంబంధించిన కేసులు కూడా గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువగా జరిగాయి. గత ఏడాది 653 నమోదైతే.. ఈ ఏడాది 825 కేసులు నమోదు అయ్యాయి. అందులో కట్నం కేసులు 4, అత్యాచారం కేసులు 8, కిడ్నాప్ కేసులు 3, పోక్సో కేసులు 87 నమోదైనట్లు ఎస్పీ వెల్లడించారు. అలాగే వేధింపుల కేసులు 302, అత్యాచార యత్నం కేసులు 197, ఆడవారిని దూషించిన కేసులు 177 కేసులు నమోదైనట్లు చెప్పారు.
215 ఆర్థిక నేరాలు..
దొంగతనాలకు సంబంఽధించి గత ఏడాది 404 నమోదు కాగ ఈఏడాది 411 కేసులు నమోదైనట్లు ఎస్పీ సతీష్ పేర్కొన్నారు. రెండు శాతం కేసులు పెరిగాయన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి గత ఏడాది 552 జరగ్గా ఈఏడాది 549 నమోదైనట్లు చెప్పారు. సైబర్ క్రైమ్‌కు సంబంధించి గత ఏడాది 23 కేసులు నమోదు కాగా ఈఏడాది 22 కేసులు నమోదైనట్లు వివరించారు. ఆర్థిక నేరాలకు సంబంఽధించి గత ఏదాది 188 కేసులు నమోదు కాగా ఈఏడాది 215 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఓపెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ 2,969, అలాగే 227 డ్రంక్‌అండ్ డ్రైవ్ కేసులకు సంబంఽధించి రూ.1,01,03,386 జరిమానా విధించామన్నారు. పేకాట స్థావరాలపై దాడులు చేసి 536 కేసులు నమోదు చేసి రూ.52,04,473 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 21 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశామన్నారు. 345 కేసులకు సంబంధించి కోర్టు శిక్షలతో పాటు జరిమానాలు పడేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
నేరాల నియంత్రణకు కృషి..
నూతన చట్టాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసి నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ సతీష్ తెలిపారు. నైట్ విజన్, డే విజన్, ద్వారా పటిష్టమైన పెట్రోలింగ్, సీసీ కెమెరాల వినియోగం పెంచి నేరాల నియంత్రణ కట్టుదిట్టం చేస్తామన్నారు. వారధి ప్రోగ్రాం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా చూస్తామన్నారు.
జిల్లాలో పెరిగిన నేరాల సంఖ్య
అరికట్టేందుకు చర్యలు చేపడతామన్న ఎస్పీ సతీష్‌కుమార్


