శోకసంద్రంలో నేమకల్లు
● కన్నీళ్లతో సింధు అంత్యక్రియలు
● అనూష కోసం ముమ్మర గాలింపు
బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు గ్రామం శోకసంద్రమైంది. కాలువలో కలిసి పోయిన చిన్నారుల బతుకులు గ్రామాన్ని కలిచివేశాయి. తండ్రి చేతిలోనే ప్రాణాలు కోల్పోయిన చిన్నారి సింధు (11) అంత్యక్రియలు బుధవారం గ్రామస్తుల కన్నీళ్ల మధ్య సాగింది. మరో బాలిక అనూష కోసం తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)లో గాలింపు కొనసాగుతోంది. గ్రామానికి చెందిన కల్లప్ప తన ఇద్దరు కుమారైలు సింధు (11), అనూష (9)ను ఎల్లెల్సీలో తోసేసిన ఘటనలో సింధు మంగళవారం మధ్యాహ్నం మృతదేహం లభ్యం కావడంతో యావత్ గ్రామం దిగ్భ్రాంతికి లోనైంది. అయితే రెండో అమ్మాయి అనూష ఆచూకీ లభ్యం కాకపోవడం కలవర పెడుతోంది. దిగువ కాలువ వెంబడి కర్ణాటక పరిధిలోని నాగేనహాళ్లి, మోకా, దమ్మురు, తిరిగేరి ప్రాంతాల్లో పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన వెనుక అసలు కారణాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. కుటుంబ కలహాలా? మానసిక సమస్యనా? లేక మరేదైనా ఉందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కల్లప్ప ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను పూర్తిగా కోలుకొని విచారణకు సహకరిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని బొమ్మనహాళ్ ఎస్‌ఐ నబీరసూల్ తెలిపారు.
మార్కెట్‌లోకి ‘ఆల్ న్యూ కియా సెల్టోస్’
పెనుకొండ రూరల్: కియా పరిశ్రమ నూతన ఉత్పత్తి ‘ఆల్ న్యూ కియా సెల్టోస్’ కారును మంగళవారం పరిశ్రమలో లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కియా ఇండియా సీఈఓ గ్వాంగ్–గు–లీ మాట్లాడుతూ.. అత్యాధునిక హంగులు, భద్రత, సాంకేతిక ప్రమాణాలతో కూడిన ఆల్ న్యూ కియా సెల్టోస్ కారు ఉత్పత్తులను ప్రారంభించినట్టు వివరించారు. ముందు తరం కార్లకు ఏ మాత్రం తీసి పోకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆల్ న్యూ సెల్టోస్ రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ కారు ఎగుమతుల్లో ఒక మైలు రాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కంపెనీ ఎగ్జిక్యూటివ్ విభాగం, సిబ్బంది పాల్గొన్నారు.
పంపనూరు హుండీ కానుకల ఆదాయం రూ.20.20 లక్షలు
ఆత్మకూరు: మండలంలోని పంపనూరు గ్రామంలోని సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈఓ బాబు, జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మూడు నెలలకు సంబంధించిన హుండీ ఆదాయం రూ.20,20954 వచ్చినట్లు పేర్కొన్నారు.
శోకసంద్రంలో నేమకల్లు


