ఉపాధి చట్టం పేరు మార్పు దారుణం
పుట్టపర్తి టౌన్: మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరును ’వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) పథకంగా కేంద్ర ప్రభుత్వం మార్పు చేసి చారిత్రక తప్పిదానికి తెరతీసిందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హరి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుటాల రమణారెడ్డి విమర్శించారు. ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై బుధవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. పేదలు వలసలను అరికడుతూ గ్రామాల్లోనే ఉపాధి కల్పించేలా 2002లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు. ఈ చట్టం కింద 20 కోట్ల మందికి ఉపాధి దొరుకుతోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్‌గా మార్చి రైతులు, కూలీల పొట్టకొట్టే చర్యలకు తెరలేపిందన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలపై కూలీలను చైతన్య పరిచి ఉపాధి హామీ చట్టం పేరును అలాగే కొనసాగించేలా ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్ధి రామకృష్ణ, మున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ఉపాధ్యక్షుడు గంగాద్రి, స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పవన్, రజక సంఘం జిల్లాకార్యదర్శి శంకర్, స్వర్ణలత, సురేంద్ర, ముత్యాలు గోవిందప్ప, తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హరి


