వృద్ధుడి అనుమానాస్పద మృతి
పుట్టపర్తి టౌన్: మండలంలోని పోతులకుంట గ్రామానికి చెందిన వెంటకరెడ్డి (80) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. పోతులకుంట గ్రామ శివారున అప్పవాండ్లపల్లికి వెళ్లే మార్గంలో వెంకటరెడ్డికి ఉన్న 1.22 ఎకరాల భూమి సరిహద్దుల విషయంగా కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన ఓబుళరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ విషయంగానే ఇద్దరిపై క్రిమినల్, సివిల్ కేసులూ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో వెంకటరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. మంగళవారం సాయంత్రం అప్పవాండ్లపల్లి రహదారిలో ఉన్న పొలంలో వెంకటరెడ్డి మృతదేహమై కనిపించాడు. అటుగా వెళ్లిన వారు గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ విజయ్‌కుమార్, సీఐ మారుతీశంకర్, డ్వాగ్ స్క్వాడ్ సిబ్బంది, క్లూస్ టీం సభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. భూ తగాదాల నేపథ్యంలోనే తన తండ్రిని ప్రత్యర్థులు గొంతు నులిమి హతమార్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతుడి కుమారుడు నారాయణరెడ్డి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


