6,012 టన్నుల యూరియా పంపిణీ : డీఏఓ
పుట్టపర్తి అర్బన్: జిల్లా రైతాంగానికి రబీ సీజన్‌లో 6,012 టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 1 నుంచి ఈ నెల 22 వరకూ 15,552 టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకూ 6,012 టన్నుల యూరియా విక్రయాలు జరిగాయన్నారు. రాబోవు 8 రోజులకు 856 టన్నుల యూరియా అవసరం ఉందన్నారు. ప్రస్తుతం సొసైటీలు, ఆర్‌ఎస్‌కేలు, మార్క్‌ఫెడ్ గోదాములు, రీటైల్ , హోల్‌సేల్ కంపెనీల వద్ద 2,599 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. దీంతో పాటు సాంకేతికంగా అభివృద్ధి చేసిన నానో యూరియా, నానో డీఏపీను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. ఎరువులను కొనుగోలు చేసే రైతులు బస్తాపై ముద్రించిన ఎంఆర్‌పీ మేరకే డబ్బు చెల్లించి డీలర్ నుంచి రసీదు పొందాలన్నారు.
ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్
బత్తలపల్లి: స్థానిక జాతీయ రహదారి బైపాస్‌లోని వై–జంక్షన్ వద్ద మంగళవారం చోటు చేసుకున్న ప్రమాదంలో ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ దాసరి రామాంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు. వ్యక్తిగత పనిపై అనంతపురం వెళ్లి తిరిగి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో వెళుతుండగా బత్తలపల్లి నుంచి యర్రాయపల్లికి వెళుతున్న ఆటో రాంగ్ రూటులో వెళ్లి ద్విచక్రవాహనాన్ని ఢీ కొంది. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు.
కబడ్డీ జట్ల ఎంపిక
కదిరి అర్బన్: త్వరలో రాష్ట్ర స్థాయిలో పోటీల్లో ప్రాతినిథ్యం వహించే జిల్లా కబడ్డీ పురుషులు, మహిళల జట్ల ఎంపిక మంగళవారం కదిరిలో జరిగింది. పురుషుల విభాగంలో నవీన్, మోహన్, నరేష్, శ్రీనివాసులు, రాజశేఖర్, శివమణి, మారుతీ, మణిదీప్, శశిధర్, వేణు, రోహిత్‌కుమార్, ప్రసాద్ నారాయణస్వామి, శ్రీహరి ఎంపికయ్యారు. అలాగే మహిళల జట్టులో అయేషా, మేజబీ, జయశ్రీ, గీతాంజలి, గంగమ్మ, గంగోత్రి, మంజుల, స్వాతి, అశ్వని, తేజస్విని, తన్మయి, వాణి, వర్షిత, అనూష చోటు దక్కించుకున్నారు. ఈ ప్రక్రియను జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సుహాసిని, కార్యదర్శి వెంకటరమణ, పీడీ వినోద్, సంధ్యారాణి, పద్మ పర్యవేక్షించారు.
వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీకి నిప్పు
లేపాక్షి: మండలంలోని మామిడిమాకులపల్లిలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నెల 21న ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి అదే గ్రామానికి చెందిన నారాయణమ్మ సోమవారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. గమనించిన కొందరు వీడియో తీసి, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులకు తెలపడంతో వారు ఎస్‌ఐ నరేంద్ర దృష్టికి తీసికెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే నారాయణమ్మ టీడీపీకి చెందిన వ్యక్తి కాదని, డ్వాక్రా మహిళా సంఘాలకు లీడర్‌గా కొనసాగుతోందని స్థానికులు పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్‌ఐ హామీ ఇచ్చారు.
యేసు సందేశం..
సన్మార్గానికి సోపానం
ప్రశాంతి నిలయం: ప్రేమ, క్షమ, కరుణ, నిస్వార్థ సేవలను అలవర్చుకుని దైవత్వాన్ని పెంపొందించుకోవాలంటూ మానవాళికి యేసు ప్రభువు ఇచ్చిన సందేశం సన్మార్గానికి సోపానమంటూ మంగళవారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత చిన్నారులు ప్రదర్శించిన నాటకం ఆకట్టుకుంది. ‘ఇమాన్యూయేల్, గాడ్ లైవ్స్ విథిన్’ పేరుతో సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ విద్యార్థులు సంగీత నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. యేసు తన చివరి రోజులలో సత్య రక్షణకు పాటుపడిన తీరును కంటికి కట్టినట్లుగా చూపి రక్తి కట్టించారు.
6,012 టన్నుల యూరియా పంపిణీ : డీఏఓ
6,012 టన్నుల యూరియా పంపిణీ : డీఏఓ
6,012 టన్నుల యూరియా పంపిణీ : డీఏఓ


