వైఎస్సార్‌సీపీ నేత మామిడి తోటకు నిప్పు
చిలమత్తూరు: హిందూపురం నియోజకవర్గంలో విష సంస్కృతికి తెరలేపుతున్నారు. ఇన్నాళ్లూ అక్రమ కేసులు, భౌతిక దాడులుకు దిగిన టీడీపీ నేతలు, ఇప్పుడు ఆర్థిక వనరులను నాశనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. హిందూపురం రూరల్ మండల పరిధిలోని కొటిపి గ్రామ సమీపంలో వైఎస్సార్‌సీపీ బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేష్‌కు చెందిన మామిడి తోటకు దుండగులు నిప్పు పెట్టడంతో 186 మామిడి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మామిడి చెట్లుకు నిప్పు పెట్టారని వాల్మీకి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారని, భౌతికంగా దాడులు కూడా చేశారని, ఇప్పుడు తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఇలా చేస్తున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న హిందూపురంలో కక్షలకు తెరలేపుతున్నారని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచాలి
● రాయలసీమ రీజియన్ హోంగార్డుల ఇన్‌చార్జ్ కమాండెంట్ మహేష్ కుమార్
పుట్టపర్తి టౌన్: పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచేలా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని హోంగార్డులకు రాయలసీమ రీజియన్ హోంగార్డుల ఇన్‌చార్జ్ కమాండెంట్ మహేష్ కుమార్ సూచించారు. మంగళవారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లాలోని హోంగార్డులకు ఒక రోజు పరేడ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహేష్‌కుమార్ హాజరై, మాట్లాడారు. ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే సబ్‌డివిజన్ అధికారులకు, ఆర్‌ఐలకు తెలియజేయాలన్నారు. అనంతరం దర్బార్ నిర్వహించి హోంగార్డుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐలు మహేష్, వలి, హోంగార్డుల ఇన్‌చార్జ్ రామాంజనేయులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నేత మామిడి తోటకు నిప్పు


