పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
● జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా ఐదు సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పిలుపునిచ్చారు. పుట్టపర్తి పట్టణ సమీపంలో ఉన్న ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 21 నుంచి 23 వరకు 2,11,391 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 2037 పోలియో కేంద్రాలు, 8,149 మంది ఆరోగ్య కార్యకర్తలను నియమించామన్నారు. 22, 23 తేదీల్లో పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిన వారికి పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాలు, మురికి వాడలు, హైరిస్క్ ప్రాంతాలు, సంచార జాతుల పిల్లలకు పోలియో చుక్కలు వేయడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పోలియో చుక్కలు వేసుకోవడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.


