నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను సమర్పించుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు సమర్పించుకొని పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలియజేశారు. అలాగే కలెక్టరేట్‌కు రాకుండా www. meekosam. ap. gov. in లో ఆన్‌లైన్ ద్వారా కూడా అర్జీలు సమర్పించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎస్పీ కార్యాలయంలో...
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల రూపంలో తెలియజేవచ్చని సూచించారు. అర్జీదారులు ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలన్నారు.


