గంజాయికి యువత దూరంగా ఉండాలి
కదిరి టౌన్: గంజాయి, డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం కదిరిలో డ్రగ్స్ వద్దు బ్రో.. అంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మొదట ఆర్‌ఆండ్‌బీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథులగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌ను అరికట్టడంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి వాడుతున్నట్లు తెలిస్తే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్లకు లేదా లోకల్ పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు. గంజాయి, డ్రగ్స్ అమ్మడం చట్టరీత్యా నేరమన్నారు. వాటిని అమ్ముతూ పట్టుబడితే నేరం రుజువైన వారికి పది నుంచి 20 ఏళ్ల వరకు శిక్ష ఉంటుందన్నారు. కదిరి ప్రాంతంలో ఇప్పటికి 40 నుంచి 42 మంది గంజాయి కేసుల్లో పట్టుపడినట్లు గుర్తు చేశారు. ఆర్‌ఆండ్‌బీ గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాని, డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు, ఎస్‌లు, విద్యార్థి సంఘలు, వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


