అక్రమ బిల్లులకు ఆమోదం
పుట్టపర్తి టౌన్: ఎక్కడైనా సరే చైర్మన్ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. కానీ పుట్టపర్తిలో మాత్రం శుక్రవారం ఎమ్మెల్యే అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. కోరం లేనందున సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి చైర్మన్ వెళ్లిపోయిన తర్వాత ఆరుగురు టీడీపీ సభ్యులతో కౌన్సిల్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పలు అక్రమ బిల్లులకు ఆమోదం తెలుపుకున్నారు. పుట్టపర్తిలో పరాకాష్టకు చేరిన ఈ అధికార దుర్వినియోగంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏం జరిగిందంటే...
మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు పుట్టపర్తి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మొత్తం 20 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో టీడీపీ సభ్యులు ఆరుగురు ఉన్నారు. మిగతా 14 మందిలో చైర్మన్ ఒక్కరే హాజరు కాగా, వివిధ కారణాలతో 13 మంది వైఎస్సార్ సీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో కోరం లేనందున సమావేశాన్ని వాయిదా వేయాలని చైర్మన్ భావించారు. అయితే ఈ సమయంలో కమిషనర్ కలుగజేసుకుని ఎక్స్‌అఫిషియో సభ్యురాలి హోదాలో ఎమ్మెల్యే సమావేశానికి వస్తున్నారని ప్రకటించారు. దీంతో ఆమెకు గౌరవం ఇచ్చిన చైర్మన్ ఓబుళపతి 12.30 గంటల వరకూ వేచి చూశారు. అయినా ఆమె రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ఆ వెంటనే కౌన్సిల్‌లో ప్రత్యక్షమైన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి..చైర్మన్ లేకపోయినా పలు బిల్లులు ప్రవేశపెట్టి ఆరుగురు టీడీపీ సభ్యులతోనే ఆమోదింపజేశారు.
అన్నీ అక్రమ బిల్ల్లులే..
సత్యసాయి శతజయంత్యుత్సవాల కోసం పుట్టపర్తి పట్టణంలో ఇటీవల పలు అభివృద్ధి పనులు చేశారు. ఆ పనులకు సంబంధించిన బిల్లులు ఈ సమావేశంలో ఆమోదింపజేసుకోవాలని టీడీపీ సభ్యులు భావించారు. కాంట్రాక్టర్లంతా టీడీపీ వారే కావడంతో ఎమ్మెల్యే వారికి వంత పాడారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు గైర్హాజరైనట్లు తెలిసిన వెంటనే పల్లె సింధూరారెడ్డి బిల్లుల ఆమోదానికి పెద్ద ప్లాన్ వేశారు. చైర్మన్ ఓబుళపతి సభలో ఉన్నంత వరకూ అక్కడకురాని ఆమె...చైర్మన్ వెళ్లిపోగానే కౌన్సిల్‌కు వచ్చి హడావుడి చేశారు. చైర్మన్ మినిట్స్ బుక్కులో సంతకం చేశారు కాబట్టి బిల్లులకు ఆయన ఆమోదం తెలిపినట్టేనంటూ పలు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు. అనంతరం నోటికొచ్చినట్లు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. తన స్థాయి మరచి మరీ ఆరోపణలు చేశారు. కాగా, అవన్నీ దొంగ బిల్లులేనని అందుకే తాము లేని సమయంలో ఆమోదింపజేసుకున్నారని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఆరోపించారు.
అధికార దుర్వినియోగానికి పరాకాష్ట
చైర్మన్, సభ్యులు లేకుండానే
పుట్టపర్తిలో మున్సిపల్ సమావేశం
కోరం లేకపోయినా బిల్లులకు ఆమోదం
దగ్గరుండి మరీ ప్రజాస్వామ్యానికి పాతర వేసిన ఎమ్మెల్యే సింధూర
ప్రజాస్వామ్య విరుద్ధం
కోరం లేకపోవడంతో సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి నేను వెళ్లిపోయాను. ఆ తర్వాత కేవలం ఆరుగురు సభ్యులతో టీడీపీ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి సమావేశం నిర్వహించి పలు బిల్లులకు ఏకపక్షంగా ఆమోదం తెలిపారు. అధికారులు కూడా ఎమ్మెల్యేకు భయపడి ఆమె చెప్పినట్లంతా చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఈ బిల్లులను కూడా రద్దు చేస్తాం.
– తుంగా ఓబుళపతి, మున్సిపల్ చైర్మన్


