కమిటీల ఏర్పాటులో మడకశిర ఫస్ట్
● కమిటీలు పూర్తయిన 10
నియోజకవర్గాల్లో 21న రచ్చబండ
● వైఎస్సార్‌సీపీ స్టేట్ కో ఆర్డినేటర్
సజ్జల రామకృష్ణారెడ్డి
● నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో టెలికాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ సంస్థాగత నిర్మాణం కీలకమైన కమిటీల ఏర్పాటులో మడకశిర నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అమరావతి నుంచి కడప, పుంగనూరు, మడకశిర, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో సంస్థాగత కమిటీల నియామకం పూర్తయిందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో 21న రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే అదేరోజు పార్టీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహిద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక నియోజకవర్గాల కమిటీల నియామకంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు కీలక పాత్ర పోషించారన్నారు. క్షేత్రస్థాయిలో బలమైన నెట్‌వర్క్ ఏర్పాటైతే.. భవిష్యత్తులో ఏ కార్యక్రమమైనా విజయవంతంగా నిర్వహించవచ్చన్నారు. ప్రస్తుతం నియాకమైన కమిటీలు యాక్టివిటీగా ఉండాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించిన తీరు, చంద్రబాబు దుర్మార్గ విధానాలపై కమిటీల సమావేశం సందర్భంగా తీర్మానం చేయాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేయడం వల్ల పేదలకు జరిగే నష్టం గురించి తీర్మానం చేసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని టెలీకాన్ఫరెన్స్‌లో నాయకులకు సూచించారు.


