ప్రమాదపుటంచు!
పొగ మంచు..
హిందూపురం: వణుకు పుట్టించే చలికి పొగమంచు తోడైంది. దీంతో సాయంత్రం నుంచి ఉదయం 7 గంటల వరకూ 44వ జాతీయ రహదారిపై దట్టమైన మంచు తెరలు కమ్ముకుని రహదారులు కనిపించక వాహనదారులు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఈ నెల 14న తెల్లవారుజామున పొగమంచు కారణంగా దారి కనిపించక ఓ ప్రైవేట్ బస్సు హిందూపురంలోని రోడ్డు పక్కన ఉన్న ఓ సెల్‌ఫోన్ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఇలాంటి తరుణంలో ప్రయాణాలు సాగించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయరాదని హెచ్చరిస్తున్నారు.
జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. కనిష్టంగా 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ రహదారులను మంచు దుప్పటి కప్పేస్తోంది. 100 నుంచి 200 మీటర్ల వరకూ రోడ్డు కనిపించని పరిస్థితి. దీంతో ఉదయం 9 గంటలైనా వాహనాలకు లైట్లు వేసుకుని నిదానంగా వెళ్లాల్సి వస్తోంది. దగ్గరికి వచ్చే వరకూ ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని పలువురు డ్రైవర్లు వాపోతున్నారు.
● ప్రయాణిస్తున్న రహదారి స్థితిగతులపై అవగాహన ఉండాలి
● మంచు తెరలు తొలిగిపోయాక ప్రయాణాన్ని కొనసాగించాలి.
● వాహనానికి వెనుక, ముందు రేడియం స్టికర్లను అతికించాలి.
● వాహనాలకు ఫాగ్ ల్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడం సురక్షితం,
● పసుపు వర్ణంతో వెలిగే దీపాలు చలికాలంలో ఎంతో మంచిది.
● వాహనాన్ని స్పీడ్ లిమిట్‌లో పెట్టుకోవాలి.
● ముందు వెళ్తున్న వాహనాలను అనవసరంగా ఓవర్ టేక్ చేయడం ప్రమాదకరం.
● వాహనాలను రోడ్ల పక్కకు తీసుకెళ్లి ఖాళీ ప్రదేశం, లేదా బాగా వెలుతురు ఉన్న చోట పార్కింగ్ చేయాలి.
● రోడ్డుపై ఆగిపోతే వెంటనే డయల్ 100 కు కాల్ చేసి పోలీసుల సాయం తీసుకోవాలి.
● అద్దాలను తుడిచే వైఫర్లు సక్రమంగా ఉంచు కోవాలి.
పొద్దు మునిగితే అలుముకుంటున్న దట్టమైన మంచు మంచు తెరల మధ్య దగ్గరికొచ్చే వరకూ కనిపించని వాహనాలు
సికింద్రాబాద్‌కు చెందిన రాళ్లపల్లి వినీల (35) ఈ నెల 6న బెంగళూరు నుంచి స్వస్థలానికి ద్విచక్ర వాహనంపై వెళుతూ.. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్దకు చేరుకోగానే పొగ మంచులో జాతీయ రహదారి పక్కన ఉన్న ఐరన్ సేఫ్టీబార్ కనిపించక ఢీకొని, రోడ్డుపై పడింది. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
... ఇది ఒక్క వినీల విషయంలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా చాలా మంది పొగ మంచు కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు.
రహదారులను కప్పేస్తున్న మంచు..
జాగ్రత్తలు పాటిస్తే మంచిది..
ప్రమాదపుటంచు!


