చీనీ, అరటి చెట్ల దగ్ధం
బత్తలపల్లి: ఉన్నఫలంగా మంటలు చెలరేగడంతో వ్యవసాయ ఉపకరణాలు, చీనీ, అరటి చెట్లు కాలి బూడిదయ్యాయి. వివరాలు... బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన రైతు నాగేష్ వేల్పుమడుగు రోడ్డు పక్కన తనకున్న నాలుగు ఎకరాల్లో చీనీ చెట్లు, మరో నాలుగు ఎకరాల్లో అరటి చెట్లు సాగు చేశాడు. వీటికి డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం హైఓల్టేజీ కారణంగా విద్యుత్ మెయిన్‌లైన్ నుంచి స్టార్టర్ పెట్టెలోకి వచ్చిన వైర్లు వేడెక్కి కరిగి షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసి పడ్డాయి. మంటలు చెలరేటి తోటలను చుట్టుముట్టడంతో స్థానికుల సాయంతో రైతు నాగేష్ మంటలను అదుపు చేయగలిగాడు. అయితే అప్పటికే 20 కట్టల డ్రిప్ పైపులు, 90 చీనీ, 40 అరటి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు.
మద్యం దుకాణానికి నిప్పు
తాడిమర్రి: మండల కేంద్రంలోని బాలాజీ మద్యం దుకాణానికి దుండగులు నిప్పు పెట్టారు. పోలీసులు తెలిపిన మేరకు.. మండల కేంద్రంలో కల్లుగీత కార్మికులకు మద్యం షాపు కేటాయించగా యర్రమల భాస్కర్‌గౌడ్ దక్కించుకుని మద్యం విక్రయాలు చేపట్టాడు. గత 23న దుండగులు నిప్పు పెట్టడంతో రూ.7 లక్షల వరకు సరుకు కాలిపోయింది. దీంతో ఆ ప్రాంతం నుంచి దుకాణాన్ని ముంటిమడుగు వెంకటప్రసాద్ రైస్‌మిల్లు సమీపంలోకి మార్చాడు. గురువారం వేకువజాము 1.30 గంటల సమయంలో మద్యం దుకాణం వెనుక వైపున నివాసముంటున్న యర్రమల మురళీగౌడ్ నిద్రలేచి బయటకు వచ్చిన సమయంలో దుకాణం కిటికీ నుంచి పొగ రావడం గమనించాడు. దీంతో విషయాన్ని వెంటనే దుకాణం నిర్వాహకులకు తెలపడంతో వారు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్పటికే మంటల్లో రూ.1.70 లక్షల విలువైన మద్యం కాలిపోయింది. ఘటనపై ఎస్‌ఐ కృష్ణవేణి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
సాంకేతిక లోపంతో
ఆగిన ప్యాసింజర్ రైలు
చెన్నేకొత్తపల్లి: మండలంలోని బసంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్యాసింజర్ రైలు గురువారం దాదాపు రెండు గంటలకు పైగా నిలిచిపోయింది. బెంగళూరు నుంచి అనంతపురానికి బయలుదేరిన ప్యాసింజర్ రైలు బసంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దాదాపు రెండు గంటల పాటు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే టెక్నికల్ సిబ్బంది అక్కడకు చేరుకొని మరమ్మతులు చేయడంతో ముందుకు సాగింది.
వ్యక్తి ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: పుట్లూరు– చల్లవారిపల్లి రైల్వే గేట్ మధ్య గురువారం ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి (55) ముంబయి– చైన్నె ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ నుంచి సమాచారం అందుకున్న జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. పింక్ కలర్ చొక్కా, బ్లూకలర్ డ్రాయర్, పంచ ధరించాడని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు తాడిపత్రి రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
డాక్టర్ రామసుబ్బయ్య
కన్నుమూత
అనంతపురం: ప్రముఖ వైద్యులు డాక్టర్ రామసుబ్బయ్య గురువారం కన్నుమూశారు. సేవే పరమావధిగా భావించి చివరి క్షణం వరకూ తన వృత్తికి న్యాయం చేస్తూ వచ్చిన డాక్టర్ రామసుబ్బయ్య మృతి జిల్లాకు తీరని లోటని వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. వైద్య రంగంలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
చీనీ, అరటి చెట్ల దగ్ధం
చీనీ, అరటి చెట్ల దగ్ధం
చీనీ, అరటి చెట్ల దగ్ధం


