సాదాసీదాగా అహుడా గ్రీవెన్స్
అనంతపురం క్రైం: అహుడా కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) సాదాసీదాగా జరిగింది. అనంతరం సంబంధిత అధికారులతో అహుడా చైర్మన్ టి.సి.వరుణ్‌తో కలిసి జేసీ శివ్‌నారాయణ్ శర్మ సమీక్షించారు. అనధికార లేఔట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ధర్మవరం పరిధిలోని కొణుతూరు లే అవుట్‌లో ప్లాట్ల విక్రయానికి అనంతపురంలోని అహుడా కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెనుకొండ, మడకశిర ఎంఐజీ లేఅవుట్లలో ప్లాట్‌ల విక్రయానికి వేలం నిర్వహించాలన్నారు. హిందూపురం, కోడూరు ఎంఐజీ లేఅవుట్ పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతపురంలో స్విమ్మింగ్ పూల్, జిమ్, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు ప్రణాళికపై చర్చించారు. కార్యక్రమంలో అహుడా సెక్రటరీ రామకృష్ణారెడ్డి, ప్లానింగ్ ఆఫీసర్ కేఎండీ.ఇషాక్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దుష్యంత్, డీఈ రేవంత్, జీపీఓ హరీష్ చౌదరి, సర్వేయర్ శరత్, ఏఓ రవిచంద్రన్, తదితరులు పాల్గొన్నారు.
‘ఐఈఎస్’కు
సిద్ధరాంపురం వాసి
ఆత్మకూరు: ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌కు (ఐఈఎస్) ఆత్మకూరు మండలం పి.సిద్ధరాంపురం గ్రామానికి చెందిన తాళ్లూరు హరికృష్ణ ప్రసాద్ ఎంపికయ్యారు. 2017లో ఢిల్లీలోని ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన 2022 వరకూ ఓ ప్రైవేటు సంస్థలో సివిల్ ఇంజనీర్‌గా పని చేశారు. 2024లో చిత్తూరు జిల్లా రామకుప్పంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏఈగా పని చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది నిర్వహించిన ఐఈఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ప్రతిభ చాటి నవంబర్‌లో జరిగిన మౌఖిక పరీక్షకు హాజరయ్యారు. ఇటీవల ఫలితాలు విడుదల కాగా, జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్‌తో అత్యున్నతమైన పోస్టుకు ఎంపికయ్యారు.
వృద్ధురాలి మృతదేహానికి
పోస్టుమార్టం పూర్తి
అనంతపురం మెడికల్: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగంలో ఈనెల 17న మృతి చెందిన కృష్ణమ్మ (70) మృతదేహానికి గురువారం సర్వజనాస్పత్రిలో ఫోరెన్సిక్ వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే కృష్ణమ్మ మృతి చెందిందంటూ మృతురాలి కుమార్తె పార్వతి వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సూపర్ స్పెషాలిటీలో జరిగిన మృతిపై వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయశ్రీ, సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి ఆరా తీశారు. కార్డియాలజిస్టు డాక్టర్ సుభాష్ చంద్రబోస్, అక్కడి సిబ్బంది తదితరులతో మాట్లాడారు. మృతురాలి బంధువుల ఆరోపణలపై ఆరా తీశారు.
మృతదేహం వెలికితీత
అగళి: మండలంలోని కొడిపల్లి చెరువు వెనుక ముక్కడపల్లికి వెళ్లే మార్గంలోని బావిలో బుధవారం సాయంత్రం స్థానికులు గుర్తించిన వ్యక్తి మృతదేహాన్ని గురువారం ఉదయం పోలీసులు వెలికి తీశారు. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి గుర్తు పట్టలేని విధంగా ఉంది. ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో అక్కడే మృతదేహానికి మడకశిర ప్రభుత్వాస్పత్రి వైద్యులతో పంచానామా చేయించి, ఖననం చేయించారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


