గుట్టుగా గుప్త నిధుల వేట
గుప్తనిధుల ముఠా సభ్యుల ఆగడాలు మితిమీరిపోయాయి. పురాతన ఆలయాలు, కట్టడాలు లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడుతున్నారు. వీరి ఆగడాలకు ప్రాచీన కట్టడాలతో పాటు పవిత్రమైన ఆలయాలు, విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి.
రొద్దం: అత్యాశ.. మూఢనమ్మకం వెరసి జిల్లాలో గుప్తనిధి వేటగాళ్ల అన్వేషణ నిత్యకృత్యమైంది. ఈ నేపథ్యంలో చారిత్రక ఆలయాలు, కట్టడాలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. రొద్దం మండలంలో తరుచూ ఏదోక ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. మండలంలోని అత్యధిక గ్రామాలు చారిత్రక నేపథ్యం ఉన్నవే కావడంతో గుప్తనిధులు ఉంటాయని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. తాజాగా రెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పురాతన యల్లమ్మదేవి ఆలయం ఎదుట గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఏకంగా జేసీబీను ఉపయోగించి రాత్రికి రాత్రి దాదాపు 20 అడుగుల మేర గుంత తవ్వారు. ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్తులు అక్కడ పెద్ద గుంత తీసి ఉండడం, పూజా సామగ్రి పడి ఉండడం గమనించి సమాచారం ఇవ్వడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పరిశీలించారు.
ముఠా సభ్యులకు స్థానికుల అండ?
గుప్త నిధుల ముఠా సభ్యులకు స్థానికులు అండగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ముఠా సభ్యులు పక్కాగా ప్రణాళిక వేసి రాత్రి సమయాల్లో తవ్వకాలను చేపడుతున్నారు. తవ్వకాలకు సహకరించేలా మండలంలో ప్రత్యేక బృందం ఉన్నట్లు సమాచారం. సంబంధిత అధికారులు ఇప్పటికై నా స్పందించి గుప్త నిధుల వేటగాళ్ల బారి నుంచి పురాతన ఆలయాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
జూదరుల అరెస్ట్
సోమందేపల్లి: స్థానిక వినాయక్ నగర్ వద్ద పేకాట ఆడుతున్న ఐదుగురిని ట్రైనీ ఎస్‌ఐ గోపాలకృష్ణ మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి, రూ.1,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వృద్ధుడిని ఢీకొన్న లారీ
యాడికి: లారీ డ్రైవర్ అజాగ్రత్త ఓ వృద్ధుడికి శాపంగా మారింది. ప్రమాదంలో రెండు కాళ్లనూ వృద్ధుడు కోల్పోయాడు. వివరాలు.. యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన 83 ఏళ్ల గంధోడి నారాయణ కుమారులు బస్టాండు ప్రాంతంలో దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దుకాణం వద్దకు నారాయణ నడుచుకుంటూ బయలుదేరాడు. తాడిపత్రి వైపు నుంచి బళ్లారికి వెళుతున్న లారీ డ్రైవర్ స్థానిక ఓ హోటల్ వద్ద ఆపే క్రమంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న నారాయణను ఆనుకుని ముందుకు పోనిచ్చాడు. దీంతో నారాయణ అదుపు తప్పి కిందపడడంతో అతని రెండు కాళ్లపై లారీ వెనుక చక్కాలు దూసుకెళ్లాయి. రెండు కాళ్లూ నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న వృద్ధుడి కుమారులు వెంటనే కారులో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి క్షతగాత్రుడిని తరలించారు. లారీ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై సీఐ శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టారు.
చారిత్రక ఆలయాలే లక్ష్యం
ఆనవాళ్లు కోల్పోతున్న పురాతన ఆలయాలు
తవ్వకాల్లో జేసీబీల వినియోగం
గుట్టుగా గుప్త నిధుల వేట


