నేటి నుంచి సంతోష్ ట్రోఫీ మ్యాచ్‌లు
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్ వేదికగా బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకూ సీనియర్ మెన్స్ నేషనల్ సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏపీఎఫ్‌ఏ) ఏర్పాట్లు పూర్తిచేసింది. గ్రూప్ జీలో భాగంగా ఆంధ్రతో పాటు తమిళనాడు, అండమాన్, పాండిచ్చేరి జట్లు తలపడనున్నాయి.
ఇసుక ట్రాక్టర్ సీజ్
రొద్దం: మండలంలోని చెరుకూరు గ్రామ సమీపంలోని పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ వీరాంజనేయులు మంగళవారం వెల్లడించారు. మళ్లీనాయకినిపల్లి గ్రామానికి బయపరెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటకకు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా చెరుకూరు సమీపంలోని గంగమ్మ గుడి వద్ద అడ్డుకుని, ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు వివరించారు. ఇసుక తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు.
వృద్ధుడి ఆత్మహత్య
పుట్టపర్తి టౌన్: జీవితంపై విరక్తితో ఓ వృద్దుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మవారిపల్లిలో నివాసముంటున్న పెద్ద వెంకట్రాముడు (72)కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు చేసిచ్చాడు. భార్య చనిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా జీవితాన్ని తాళలేక సోమవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. ఆలస్యంగా గమనించిన బంధువులు అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న వెంకట్రాముడిని వెంటనే సత్యసాయి జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం ఆయన మృతి చెందాడు. ఘటనపై పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


