ఆశా వర్కర్ల సమస్యలకు అధికారులే కారణం
పుట్టపర్తి అర్బన్: ఆశావర్కర్ల సమస్యలు నెరవేరకపోవడానికి వైద్యాధికారులే కారణమని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. వైద్య సిబ్బంది కూడా ఇష్టానుసారంగా విధులు కేటాయిస్తూ ఆశా వర్కర్లపై పని ఒత్తిడి పెంచుతున్నారన్నారు. ఒక్కోసారి నాలుగు రకాల సర్వేలు చేయాలంటూ ఒత్తిళ్లు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల విషయంగా ఇబ్బంది పడుతున్న ఆశాలకు న్యాయం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,700 మంది ఆశావర్కర్లు ఉన్నారని వీరికి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఎంహెచ్‌ఓకు అందజేశారు.
డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ధర్నా


