‘కోటి’ గొంతుకల గర్జన
సాక్షి, పుట్టపర్తి
చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా ఉద్యమం’ ర్యాలీ విజయవంతమైంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా సేకరించిన లక్షలాది సంతకాల పత్రాలను విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. పుట్టపర్తిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సంతకాల పత్రాల వాహనానికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ జెండా ఊపారు. అనంతరం స్థానిక గణేష్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. శ్రీసత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు భారీ జన సందోహం మధ్య సాగింది. దారి పొడవునా ‘జై జగన్’ నినాదాలతో కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉషశ్రీచరణ్‌తో పాటు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక, కదిరి సమన్వయకర్త బీఎస్ మక్బూల్, మాజీ మంత్రి నర్సేగౌడ, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, సీనియర్ నేతలు పూల శ్రీనివాసరెడ్డి, వజ్రభాస్కర్‌రెడ్డి, చౌళూరు మధుమతిరెడ్డి, కేతిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి, వేణురెడ్డి, పురుషోత్తంరెడ్డి, ప్రణీత్‌రెడ్డి, రమేశ్ నాయక్, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.
దారి పొడవునా ప్రభంజనం
ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి పట్టణంలో ఉదయం నుంచి కోలాహలం నెలకొంది. జిల్లా నలుమూలల నుంచి భారీ కాన్వాయ్‌లో నాయకులు, కార్యకర్తలు పుట్టపర్తికి చేరుకున్నారు. దీంతో గణేష్ సర్కిల్ నుంచి పార్టీ కార్యాలయం వరకు సందడి నెలకొంది. అనంతరం సంతకాల పత్రాల బాక్సులను వాహనంలోకి ఎక్కిస్తుండగా... బండిళ్లు మోసేందుకు యువత ఉత్సాహం చూపించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జెండాలతో ర్యాలీలో కదం తొక్కారు. దారి పొడవునా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఇది ప్రభుత్వానికి హెచ్చరిక..
ప్రజలు చేసిన ప్రతి సంతకం ప్రభుత్వానికి ఇచ్చే శక్తివంతమైన హెచ్చరిక అని ఉషశ్రీచరణ్ అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పార్టీలకు అతీతంగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని భారీ సంఖ్యలో సంతకాలు చేశారన్నారు. ప్రజల ఆరోగ్య హక్కు కోసం జగనన్న తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కమీషన్ల కోసం ప్రైవేటీకరణలోకి నెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. జగనన్న హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలై వాటిలో 7 పూర్తవగా, ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు జరిగాయన్నారు. మిగతా కాలేజీల పనులు వివిధ దశల్లో ఉన్నప్పటికీ వాటిని పీపీపీ పేరిట ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు సిద్ధం కావడం అన్యాయమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రంలో 2,450 మెడికల్ సీట్లను విద్యార్థులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందే..
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ర్యాలీలో పాల్గొన్న వారు ప్రజలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు అన్నింటినీ పూర్తి చేసి ప్రభుత్వమే నడపాలన్నారు. పేద విద్యార్థులు డాక్టర్లు కావడం చంద్రబాబుకు ఇష్టం లేకనే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు.
ప్రైవేటీకరణ విరమించుకోవాల్సిందే..
తన బినామీలను బాగుపర్చేందుకే చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని.. హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక, కదిరి సమన్వయకర్త మక్బూల్, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప మండిపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా నుంచి లక్షలాది మంది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారని సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలనుంచి సేకరించిన సంతకాల పత్రాలను తాడేపల్లికి పంపుతున్నామని, వీటిని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌కు అందజేస్తారన్నారు.
స్వచ్ఛందంగా మద్దతు తెలిపి నినదించిన ప్రజానీకం
పుట్టపర్తి పురవీధుల్లో మార్మోగిన ‘జై జగన్’ నినాదం
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన
సంతకాల ప్రతులు విజయవాడకు తరలింపు
పుట్టపర్తిలో జన ప్రభంజనం
మెడికల్ కళాశాలలప్రైవేటీకరణపై కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
గణేష్ సర్కిల్ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు భారీ ర్యాలీ
జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఉషశ్రీచరణ్
జనం ప్రభంజనంలా తరలివచ్చారు.
పుట్టపర్తిలో కదం తొక్కారు. మెడికల్
కళాశాలల ప్రైవేటీకరణకు సిద్ధమైన
చంద్రబాబు సర్కార్ వెన్నులో వణుకు పుట్టేలా రణన్నినాదం చేశారు. వైఎస్సార్ సీపీ జెండాలు చేతబట్టుకుని తమ అండ ఇదేనంటూ గొంతెత్తి చాటారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ సోమవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో నిర్వహించిన ర్యాలీలో పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల నేతలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా కదలి వచ్చి గర్జించారు.
సీఐ శివాంజనేయులు దురుసు ప్రవర్తన
ప్రజా ఉద్యమంలో పాల్గొనేందుకు పుట్టపర్తికి విచ్చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీ ప్రారంభమయ్యే వరకు పార్టీ కార్యాలయం గేటు దాటి రాకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రోడ్లపై తిరిగేందుకు మీకు పర్మిషన్ ఇవ్వలేదు.. కాదు.. కూడదంటే కేసులు నమోదు చేస్తా’’ అంటూ హెచ్చరించారు. సీఐ తీరుపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మండిపడ్డారు. ర్యాలీ చేస్తే కేసులు నమోదు చేస్తారా? పర్మిషన్ ఇచ్చాకే ర్యాలీ చేసేందుకు వచ్చామని సమాధానం ఇచ్చారు.
‘కోటి’ గొంతుకల గర్జన
‘కోటి’ గొంతుకల గర్జన
‘కోటి’ గొంతుకల గర్జన
‘కోటి’ గొంతుకల గర్జన


