అమరజీవి త్యాగం మరువలేనిది
● పొట్టి శ్రీరాములు వర్ధంతి సభలో
కలెక్టర్ శ్యాంప్రసాద్
ప్రశాంతి నిలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్‌లో పొట్టి శ్రీ రాములు వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసి అమరులయ్యారన్నారు. ఆయన త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రభుత్వ అధికారులు అందరూ పొట్టి శ్రీరాములు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సేవలో నిబద్ధత, నిజాయతీ, బాధ్యతతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై రైతుల ధర్నా
రొద్దం: మండల పరిధిలోని పెన్నా పరివాహక ప్రాంతం నుంచి కొందరు ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..ఇసుక అక్రమ రవాణా వల్ల పెన్నానది రూపురేఖలు కోల్పోయిందన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తరలించడం వల్ల భూగర్భజలం తగ్గి తమ బోర్లు ఒట్టిపోయాయన్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే తమపైనే దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. అనంతరం ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో చిన్నమంతూరు రామంద్రారెడ్డి, రామాంజి, సూరి, తిమ్మయ్య, పలువురు రైతులు పాల్గొన్నారు.
కలుషిత ఆహారం..
విద్యార్థినులకు అస్వస్థత
నల్లచెరువు: స్థానిక కేజీబీవీలో ఈ నెల 9వ తేదీన కలుషిత ఆహారం తిని ముగ్గురు ఇంటర్ విద్యార్థిలు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... స్థానిక కేజీబీవీలో 230 మందికిపైగా విద్యార్థినులు ఉన్నారు. ఈ నెల 9వ తేదీన నవిత, సమంత, ఉషారాణి రోజూలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి ఉపక్రమించారు. భోజనం సగం తిన్నాక ఒక రకమైన వాసన రావడంతో మధ్యలోనే వదిలేసి పాఠశాల ఎస్‌ఓకు చెప్పగా... ఆమె హుటాహుటిన వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. అయితే విషయం బయటకు రాకుండా ఉండేందుకు ముగ్గురు విద్యార్థినులను అదేరోజు ఇళ్లకు పంపించినట్లు సమాచారం. వీరిలో నవిత అనే బాలిక కోలుకుని సోమవారం పాఠశాలకు వచ్చింది. మిగతా ఇద్దరు విద్యార్థినులు ఇంటి వద్దే చికిత్స చేయించుకుంటున్నారని సమాచారం. ఈ విషయంపై ఎస్‌ఓ శిరీషను వివరణ కోరగా... ఈ నెల 9వ తేదీన ముగ్గురు విద్యార్థులు మధ్యాహ్న భోజనం పెట్టించుకుని.. సాయంత్రం వరకూ ప్లేట్ మూసి ఉంచారన్నారు. అందువల్లే భోజనం వాసన వచ్చిందన్నారు. అయినప్పటికీ విషయం తెలియగానే వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్ష చేయించానన్నారు. వైద్యులు కూడా వారికి ఫుడ్ పాయిజన్ అయినట్లు చెప్పలేదన్నారు.
అమరజీవి త్యాగం మరువలేనిది
అమరజీవి త్యాగం మరువలేనిది


