గడువులోపు అర్జీలన్నీ పరిష్కరించాలి
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీలన్నీ నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై ప్రజలు 336 అర్జీలు సమర్పించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారం కోసం వివిధ శాఖలకు పంపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్ పెండింగ్‌లో పెడితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పుట్టపర్తి ఆర్జీఓ సువర్ణ, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్యతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కుట్టు మిషన్లు ఇవ్వలేదు..
బీసీ కార్పొరేషన్ ద్వారా తమకు కుట్టుపై శిక్షణ ఇచ్చినప్పటికీ మిషన్లు, ఇతర ముడి సామగ్రి ఇవ్వలేదని, అంతేకాకుండా రుణాలు సైతం ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మోసం చేసిందని మహిళలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సీపీఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్పతో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము మూడు నెలలు సొంత ఖర్చులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కుట్టు శిక్షణ తీసుకున్నామన్నారు. శిక్షణ పూర్తి చేసుకుని 9 నెలలు పూర్తికావస్తున్నా... ప్రభుత్వం మాత్రం మిషన్లు ఇవ్వలేదన్నారు. ఇప్పటికై నా తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.
అంగన్‌వాడీల్లో ఆహారం బాగోలేదు..
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను అందిస్తున్నారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్‌ను వినతి పత్రం అందజేశారు. అంగన్‌వాడీల సరఫరా చేసే కోడిగుడ్లు నిబంధనల మేరకు 50 గ్రాములు ఉండాలని, కానీ 25 గ్రాములే ఉంటున్నాయన్నారు. పాడైపోయిన చిక్కీలను విద్యార్థులకు అందిస్తున్నారని, నాణ్యత లేని సరుకులను సరఫరా చేస్తున్నారన్నారు. సదరు ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలని కోరారు.
అధికారులకు కలెక్టర్
శ్యాం ప్రసాద్ ఆదేశం
‘పరిష్కార వేదిక’కు ప్రజల నుంచి
336 అర్జీలు


