బాల్యానికి మాదీ భరోసా
● బాల్య వివాహాలు చేయబోమన్న తల్లిదండ్రులు
● హామీ ఇస్తూ కలెక్టర్‌కు బాండ్ సమర్పణ
ప్రశాంతి నిలయం: చిన్నారుల బంగారు బాల్యానికి మాదీ భరోసా అంటూ పలువురు తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. అంతేకాదు తమ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్య వివాహాలు చేయబోమని హామీ ఇస్తూ కలెక్టర్‌కు ఏకంగా బాండ్ సమర్పించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో పలువురు బాలికల తల్లిదండ్రులు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌ను కలిశారు. బాల్య వివాహ ముక్త భారత్–100 రోజుల కార్యక్రమం వల్ల బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు తెలిశాయన్నారు. తాము బాల్యవివాహాలు చేయబోమని, ఎక్కడైనా బాల్య వివాహం జరిగినా అడ్డుకుంటామన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ... ‘మేము సైతం’ అంటూ బాల్య వివాహాల నిర్మూలనకు స్వచ్ఛందంగా తల్లిదండ్రులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.


