ఘనంగా కనకదాస జయంత్యుత్సవం
చిలమత్తూరు: హిందూపురంలోని మోతుకపల్లిలో భక్త కనకదాస జయంత్యుత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్, హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక జ్యోతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గొరవయ్యల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కురుబలు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
కారు ఢీ – విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఓడీ చెరువు: కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఓడీచెరువులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న భార్గవ్ (8వ తరగతి), నరసింహ (9వ తరగతి) ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో ఉంటున్నారు. ఆదివారం భోజనాలు తీసుకుని వచ్చేందుకు అయ్యప్పస్వామి ఆలయం వద్దకు హాస్టల్ సిబ్బందికి చెందిన స్కూటీలో వెళుతుండగా ఎం.కొత్తపల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన భార్గవ్, నరసింహను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, కొన్ని రోజులుగా హాస్టల్‌లో విద్యార్థులకు భోజనాలు సిద్ధం చేయకుండా సమీపంలోని ఆలయం వద్ద పెడుతున్న ఆహారాన్ని సమకూరుస్తున్నట్లుగా సమాచారం.
దుకాణంలోకి
దూసుకెళ్లిన బస్సు
హిందూపురం: స్థానిక బెంగళూరు రోడ్డు లోని బోయపేటలో ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి సెల్‌ఫోన్ దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వృద్ధుడి ఆత్మహత్య
రొద్దం: మండలంలోని లక్సానిపల్లికి చెందిన నారాయణప్ప(79) ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా తీవ్ర అనార్యోగంతో బాధ పడుతున్న ఆయన జీవితంపై విరక్తితో ఆదివారం శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 80 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు పెనుకొండలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. అక్కడ చికిత్సకు స్పందించక మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఘనంగా కనకదాస జయంత్యుత్సవం


