కారు ఢీకొని మహిళ మృతి
ధర్మవరం రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరం మండలం తుంపర్తి కాలనీలో నివాసముంటున్న మల్లేశ్వరమ్మ (50) కుమారుడు శివ అయ్యప్ప స్వామి మాల వేశాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కోనమల్లేశ్వరస్వామి సన్నిధిలో నిద్ర చేయాలని నిర్ణయించుకున్న వారు సాయంత్రం ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లారు. కాలనీ నుంచి రోడ్డుపైకి చేరుకోగానే పుట్టపర్తి వైపు ఽ నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు డీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన తల్లి, కుమారుడిని స్థానికులు వెంటనే ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మల్లేశ్వరమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయపడిన శివకు చికిత్స అందజేశారు. ఘటనపై ధర్మవరం రూరల్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
యువకుల బైక్ వీలింగ్.. పాత్రికేయుడిపై దాడి
లేపాక్షి: స్థానిక జాతీయ రహదారిపై హిందూపురానికి చెందిన కొందరు యువకులు బైక్ వీలింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం రోడ్డుపై రయ్యిమంటూ దూసుకెళుతూ వీలింగ్ చేస్తున్న యువకులను స్థానిక పాత్రికేయుడు ఒకరు వెళ్లి నిలువరించే ప్రయత్నం చేశాడు. ఆలయ దర్శనానికి వచ్చే పర్యాటకులు, భక్తులు ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి చర్యలు సరికాదని హితవు పలకబోతుండగా అప్పటికే మత్తులో ఉన్న యువకులు రెచ్చిపోయారు. ‘మా ఇష్టం. అడగడానికి నీవెవ్వరు? పోలీసులే మమ్మల్ని ఏమీ అనడం లేదు. నీవెంత? వచ్చేవారు వస్తుంటారు.. పోయేవాళ్లు పోతుంటారు’ అంటూ దాడికి తెగబడ్డారు. సమీపంలోని పొలాల్లో ఉన్న రైతులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో పాత్రికేయుడి బైక్ తాళాన్ని లాక్కొని ఉడాయించారు. కొట్నూరు, చోళసముద్రం, గలిబిపల్లి క్రాస్ నుంచి లేపాక్షి పిల్లిగుండ్ల కాలనీ వరకూ రోజూ కొందరు యువకులు బైక్ రేసింగ్, వీలింగ్‌లతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.


