ఉపాధ్యాయుడి దుర్మరణం
ఓడీచెరువు(అమడగూరు): ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ ఉపాధ్యాయుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ముదిగుబ్బకు చెందిన హరికృష్ణ (36) అమడగూరు మండలం జవుకలకొత్తపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం వ్యక్తిగత పనిపై కర్ణాటకలోని బాగేపల్లికి వెళ్లిన ఆయన అక్కడ పనిముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. అమడగూరు సబ్ స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే మహమ్మదాబాద్ వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుమతి అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, హరికృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


