కేసులో శిక్ష పడిన నువ్వా మాట్లాడేది?
● మా పార్టీ అధినేతను విమర్శించే స్థాయి నీకెక్కడిది కందికుంట
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి ధ్వజం
కదిరి టౌన్: ‘డీడీల కుంభకోణం కేసులో శిక్ష పడిన నువ్వు కూడా మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తావా?’ అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. కదిరిలోని తన స్వగహంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గెలుపోటముల గురించి కందికుంట మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. 2004 ఎన్నికల్లో కందికుంట ఓడిపోయాడని, 2009లో స్వల్ప మెజార్టీతో గట్టెక్కాడని, 2014లో అత్తార్ చాంద్‌బాషా చేతిలో, 2019లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సిద్దారెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరునికీ ఉంటుందన్నారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ కందికుంట అని పట్టణ ప్రజలందరికీ తెలుసన్నారు. కందికుంట ఆయన ఇంటి ముందు, వెనుక గుంతలు కూడా పూడ్చలేని స్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 19 నెలలవుతున్నా రింగ్ రోడ్డు, ఎన్‌పీ కుంట రోడ్డు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వంలో వేసిన రోడ్లన్నీ నాసిరకంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు వస్తే అతివృష్టి, అనావృష్టి తప్ప అభివృద్ధి ఏమీ ఉండదన్నారు. గత ప్రభుత్వంలో హంద్రీ–నీవా ద్వారా ప్రతి చెరువు నింపామన్నారు. తమ పార్టీ అధినేత గురించి మాట్లాడే అర్హత కందికుంటకు లేదన్నారు. దిగజారి అసభ్యకరంగా మాట్లాడుతున్నావు. నీ కంటే మాస్ భాషతో మేమూ మాట్లాడగలం. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో అని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే ముందు కదిరి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది.. నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారు అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలన్నారు. మాటలు మాని అభివృద్ధి కోసం కృషి చేయాలని హితవు పలికారు.
సనాతన ధర్మం గొప్పదనం
భవిష్యత్ తరాలకు తెలియాలి
కదిరి టౌన్: సనాతన ధర్మం గొప్పదనం భవిష్యత్ తరాలకు తెలియాలని వీరజానందస్వామిజీ పేర్కొన్నారు. పట్టణంలోని బాలికల కళాశాల ఆవరణలో శనివారం సాయంత్రం హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీరజానందస్వామిజీ (కందిమల్లయ్యపల్లి) హాజరై మాట్లాడారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి 100 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా హిందూ సమ్మేళనం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఖాద్రీ ఆలయం ప్రధాన అర్చకులు కుమార్‌స్వామి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, డాక్టర్ మదన్‌కుమార్, కృష్ణ మోహన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘అనంత’లో సున్నీ కాన్ఫరెన్సు
అనంతపురం కల్చరల్: నగరంలో రెండో రోడ్డులోని బహువుద్దీన్ మసీదు వేదికగా ఆదివారం సున్నీ కాన్ఫరెన్సు జరగనుంది. తెహరికె ఫైజానే ఉమర్ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాన్ఫరెన్స్‌లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. మహ్మద్ ప్రవక్త (స) కేశదర్శనం, ప్రవక్త ధరించిన అరుదైన దుస్తులు, ఇతర వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. సున్నీ కాన్ఫరెన్స్‌కు వివిధ రాష్ట్రాల నుంచి పేరుగాంచిన మత పెద్దలు హాజరై ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తారు. శనివారం సాయంత్రం మసీదు వద్ద నిర్వాహకులు వివరాలను వెల్లడించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారి సౌకర్యార్థం రాత్రి భోజన సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు ప్రత్యేకంగా పరదా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.


